- ఓ కంపెనీకి రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశం
- నిజామాబాద్ జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: లక్కీ డ్రాలో గెలిచిన కారు ఇవ్వకుండా కస్టమర్ కు టోకరా వేయాలని చూసిన ఓ కంపెనీపై రాష్ట్ర వినియోగదారుల ఫోరం మండిపడింది. కారు లేదా దాని వాల్యూకు 6శాతం వడ్డీ కలిపి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా కన్జ్యూమర్ ఫోరమ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. భీమ్ గల్ కు చెందిన నలుగురు.. శ్రీ మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ లక్కీ డ్రా నిర్వహించారు. దీని ప్రకారం 14 నెలలు రూ. 1500 చొప్పున కడితే ప్రతి నెలా డ్రా ఉంటుందని, అందులో ఆల్టో కే10 కారుతో పాటు 300 ఇతర బహుమతులు గెలుచుకోవచ్చని ప్రకటించారు.
దీంతో ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన దంతోజీ సుమన్ సభ్యుడిగా చేరి నెలకు రూ. 1500 చొప్పున కట్టాడు. చివరి వాయిదా అయిన 14వ నెలలో లక్కీ డ్రా తీయగా సుమన్‌కు కారు వచ్చిందని శ్రీ మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కూడా తీశారు. విజేతకు వారం రోజుల్లో కొత్త కారును అందజేస్తామని ప్రకటించారు. చెప్పిన గడువులోగా కారు రాకపోవడంతో సుమన్నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్స్ ఫోరమ్ ను ఆశ్రయించాడు. దీంతో జిల్లా ఫోరం సుమన్‌కు అనుకూలంగా తీర్పు చెప్పి, అతనికి నెలలోపు కారు అందజేయాలని చెప్పింది.
Also Read : జనవరిలో పంచాయతీ ఎన్నికలు?
జిల్లా ఫోరం తీర్పుపై స్టేట్ ఫోరంలో సవాల్
నిజామాబాద్ కన్జ్యూమర్స్ ఫోరమ్ తీర్పును సవాల్‌చేస్తూ సదరు కంపెనీ స్టేట్ కమిషన్ ను ఆశ్రయించింది. డిస్ట్రిక్ట్ ఫోరం ఎలాంటి ఆధారాలు పరిశీలించకుండా తీర్పు చెప్పిందని అప్పీల్చేసుకుంది. తమ కంపనీకి లైసెన్స్ లేదని భీమ్ గల్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదవడంతో తాము లక్కీ డ్రాలు నిర్వహించడం లేదని, డబ్బులు వసూలు చేయడం లేదని వాదించింది.
అన్ని వివరాలను పరిశీలించిన కమిషన్లక్కీ డ్రా టైంలో తీసిన వీడియో ఆధారంగా సదరు కంపెనీ విజేతను మోసం చేయాలని చూసిందని అభిప్రాయపడింది. ఇచ్చిన మాట ప్రకారం కారు లేదా దాని వ్యాల్యుతో డబ్బులు చెల్లించాలని కంపెనీకి స్పష్టం చేసింది. అలాగే.. ఖర్చులకు రూ.వెయ్యి చెల్లించాలని ఆదేశించింది.