
ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు నమోదైంది. మావోయిస్టు పార్టీ నేతలు నంబాల కేశవరావు, సజ్జా నాగేశ్వరావుల మృత దేహాలను బంధువులకు అప్పగిస్తానని మే24న చత్తీస్ ఘడ్ అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టు బెంచి ఎదుట హామీ ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెల్సిందే! ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు శిక్షించాలని మే 27న ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది.
కేశవరావు తల్లి భారతమ్మ, అన్నయ్య ఢిల్లీశ్వర్రావు తరపున పౌర హక్కుల సంఘం (CLC) దాఖలు చేసింది. ఆ సంఘం నాయకులు చిలకా చంద్రశేఖర్, టి ఆంజనేయులు, జాబాలి పిటిషన్ దాఖలు చేశారు.మే 25న సాయంత్రం కోర్టు ధిక్కార కేసు దాఖలు చేయడానికి ప్రయత్నించినా కొన్ని సాంకేతిక కారణాల వల్ల నమోదు కాలేదు. దీంతో ఇవాళ(26) హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ కేసులో ఛత్తిస్ ఘడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అరుణ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ IG సుందర్ రాజ్ ల్ని ప్రతివాదులుగా చేశారు. ఈ కేసు మే 29న విచారణకు రానుంది.
మే 21న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మరుసటిరోజే వీరి డెడ్‌బాడీలన్నీ చత్తీస్ ఘడ్ నారాయణపూర్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంబాలతో పాటు తెలగు రాష్ట్రాలకు చెందిన 8 మంది మృతదేహాల కోసం నంబాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వాటిని చత్తీస్ ఘడ్ పోలీసులు పట్టించుకోలేదు. మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవరావుతో సహా 8 మంది మావోయిస్టుల మృతదేహాలను నారాయణ్‌పూర్ పోలీసులు మే 26న దహనం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల డెడ్‌బాడీలను ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా నారాయణపూర్ పోలీసులు టైమ్‌పాస్ చేశారని చత్తీస్‌గఢ్ పౌరహక్కుల సంఘం నేత బేలా భాటియా ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలున్నా.. డెడ్‌బాడీలు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం ఇదే తొలిసారని తెలిపారు. కేంద్రం కావాలనే ఇలా చేసిందని పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడ్తున్నారు. నంబాల కేశవ రావుది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. నక్సల్ బరి ఉద్యమం ఈ జిల్లాలోనే ఊపిరి పోసుకున్నది. ఈ నేపథ్యంలో నంబాల డెడ్‌బాడీ అప్పగిస్తే తిరిగి ఉద్యమం బలపడుతుందనే భయం కేంద్రం ప్రభుత్వం, పోలీసుల చర్యల్లో కనిపిస్తున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.