సెప్టెంబర్ 11 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

సెప్టెంబర్  11 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకూ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్లతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సర్కారు నుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల11 నుంచి సమ్మె చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్ణయించారు.  ఈ మేరకు సర్కారుకు నోటీసులు జారీచేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష పరిధిలో మొత్తం 27,168 పోస్టులు ఉండగా, దాంట్లో 25,728 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మిగిలిన 1,890 మంది ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్నారు. వీరంతా రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక స్కూల్ స్థాయి వరకూ పనిచేస్తున్నారు.  విద్యాభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారు. స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ నుంచి డీఈఓ, ఎంఈఓ ఆఫీసులో సర్కారుకు టీచర్లకు, అధికారులకు అనుసంధాన కర్తలుగా ఉన్నారు. ప్రధానంగా కేజీబీవీ, యూఆర్ ఎస్, యూఆర్ హెచ్​ల్లో పనిచేసే టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ తో పాటు పార్ట్ టైమ్ ఇన్​స్ర్టక్టర్లుగా ఉన్నారు. 

15 ఏండ్ల నుంచి సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్నా..

సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు,  ఏపీఓలు, సిస్టమ్ అనలిస్టులు, టెక్నికల్ పర్సన్స్, అకౌంటెంట్స్, ఆఫీస్ సబార్డినేట్లు, ఇలా అనేక హోదాల్లో వీరంతా పనిచేస్తున్నారు. వీరికి జీతం రూ.11వేల నుంచి  రూ.25 వేల వరకూ ఉండగా, అత్యధిక మందికి రూ.19,500 వరకూ ఉంది. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.  దాదాపు 15 ఏండ్ల నుంచి సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్నా ఎలాంటి బెనిఫిట్స్ లేవు.  రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి, ఇప్పటికే సుమారు 6వేల మందిని చేసింది. అయితే, కేంద్ర ప్రాజెక్టు అయిన సెర్ప్ (వెలుగు)లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసినట్టు తమనూ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.  సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా  ప్రస్తుతం జిల్లాల్లో రిలే నిరాహారదీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే  ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చారు. మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు సీఎస్, ఎడ్యుకేషన్ సెక్రెటరీ, సమగ్ర శిక్ష ఎస్పీడీకి సమ్మె నోటీసులు అందజేశారు. ఈనెల 11 నుంచే సమ్మెకి పోతామని హెచ్చరించారు.  సమ్మె జరిగితే టీచర్ల బదిలీలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.