కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘గుర్తింపు’ బుగులు

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ‘గుర్తింపు’ బుగులు
  • యూజీసీ రికగ్నైజేషన్ లేకుంటే నో రెగ్యులరైజేషన్ 
  • గుర్తింపులేని వర్సిటీల నుంచే 150 మంది పీజీ డిగ్రీలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఫేక్ యూనివర్సిటీల బుగులు మొదలైంది. ఇంటర్, పీజీ స్థాయిలో యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు పొందినోళ్లు వందల్లో ఉన్నారు. దీంతో వారందరికీ రెగ్యులరైజ్ అవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు జూనియర్ కాలేజీల్లో 3,686 మంది, డిగ్రీ కాలేజీల్లో 811 మంది, పాలిటెక్నిక్​లో 443 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉన్నారు. వీరిలో చాలా మంది జూనియర్ లెక్చరర్లకు పీజీ సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల వర్సిటీలకు చెందినవి ఉన్నాయి. జనరల్ కోర్సుల లెక్చరర్లు 40 వర్సిటీలవి, ఒకేషనల్ కోర్సుల లెక్చరర్లు 29 వర్సిటీల సర్టిఫికెట్లు పెట్టారు. దీంతో సర్టిఫికెట్లు పెట్టే నాటికి ఆ యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్నది పరిశీలించిన అధికారులు.. 150 మంది అనర్హులని గుర్తించినట్లు సమాచారం. గుర్తింపు లేని వర్సిటీల్లో చదివిన వాళ్లవి, ఏజ్ లిమిట్ దాటినవాళ్ల వివరాలు రిమార్కులతో ఈ వారంలో పంపిస్తామని, సర్కారు నిర్ణయమే ఫైనల్ అని అధికారులు చెప్తున్నారు. 

ఐదుగురికి షోకాజ్  

పాలిటెక్నిక్ కాలేజీల్లో 443 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. వారిలో ఐదుగురు యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల నుంచి పీజీ సర్టిఫికెట్లు పెట్టారు. వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషరేట్ నుంచి `షోకాజ్ నోటీసులు ఇచ్చారు. డిగ్రీలో 811 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా, వాళ్లలో 18 మంది యూజీసీ గుర్తింపు లేని వర్సిటీల సర్టిఫికెట్లు పెట్టినట్టు తెలిసింది. మరో 350 మందికి పీహెచ్ డీ, నెట్, సెట్ తదితర క్వాలిఫికేషన్స్ లేవని గుర్తించారు. వారికీ రెగ్యులరైజ్ అయ్యే చాన్స్ లేదని తెలుస్తోంది. ఇంటర్ కాలేజీల్లో లెక్చరర్లుగా చేరేటపుడు  రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ (34 ఏండ్లు) దాటినోళ్లు 50 మందిదాకా ఉన్నట్టు చెప్తున్నారు. మరోపక్క ఒకేషనల్​లో 613 శాంక్షన్డ్ పోస్టులుండగా, 800 మందికి పైగా కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్​లో ఎవ్వరికీ క్వాలిఫికేషన్ లేదని, జనరల్ ఫౌండేషన్​ కోర్సులో 200 మంది పనిచేస్తుండగా, ఒక్కటి కూడా శాంక్షన్డ్ పోస్టు లేదని చెప్తున్నారు.