బాండ్ అగ్రిమెంట్ ​నిర్ణయం సరికాదు

బాండ్ అగ్రిమెంట్ ​నిర్ణయం సరికాదు
  • బాండ్ అగ్రిమెంట్​పై ఆందోళనలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు
  • కొనసాగింపు కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చిన ఓయూ అధికారులు
  • ఆయా కాలేజీల్లో  ఈ నెల 24 లోగా బాండ్లను అందించాలంటూ డెడ్​లైన్
  • దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి  సిద్ధమవుతున్న  కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ

ఓయూ, వెలుగు:  ఓయూ కాంట్రాక్టు అసిస్టెంట్​ ప్రొఫెసర్ల కొనసాగింపులో వర్సిటీ అధికారులు కొత్తగా బాండ్ అగ్రిమెంట్​ విధానాన్ని అమలుచేయాలని ఈ నెల 9న సర్క్యులర్​ జారీచేశారు. ఈ నెల 24లోగా  కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ఫ్రొఫెసర్లు అందరూ  ఆ  బాండ్ అగ్రిమెంట్​ను ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్​కు అందజేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా బాండ్ అగ్రిమెంట్ అందజేయని వారిని విధులకు హాజరు కానివ్వమంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  వందేళ్ల ఓయూ చరిత్రలో ఇలాంటి బాండ్ అగ్రిమెంట్ విధానం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని.. దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్తున్నారు.  గతంలో పనిచేసిన వైస్​చాన్స్​లర్లు కనీసం  ఇలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదంటున్నారు.  ప్రస్తుత వీసీ  ప్రొఫెసర్​ రవీందర్​ బాండ్​ అగ్రిమెంట్​ పేరుతో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1254 పోస్టుల్లో  పర్మినెంట్ ప్రొఫెసర్లు 394 మాత్రమే..

ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 1,254 టీచింగ్​ పోస్టులుండగా ప్రతి ఏడాది రిటైర్ మెంట్లు జరుగుతుండటం, మరోవైపు రిక్రూట్​మెంట్​లేకపోవడంతో ఆ సంఖ్య 394కు పడిపోయింది. స్టూడెంట్లకు టీచింగ్​ పరంగా నష్టం రాకుండా ఉండేందుకు   కొన్నేళ్లుగా కాంట్రాక్ట్​ పద్ధతిలో396 మంది అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి రెగ్యులర్ టీచింగ్ పోస్టుల రిక్రూట్​మెంట్ లేక .... కేవలం మూడింట ఒక వంతు ( 1/3 ) పర్మినెంట్ టీచింగ్ పోస్టులతోనే  నెట్టుకొస్తున్నారు.  దీంతో యూజీ , పీజీ కోర్సుల్లో పాఠాలు చెప్పడానికి , డిజర్టేషన్ , ప్రాజెక్టు వర్క్ మొదలైన పరిశోధన అంశాలకు గైడ్ చేయడానికి , పలు పరిపాలనా సంబంధమైన పనులు చేయడానికి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల​ సేవలను  ఓయూలో ఉపయోగించుకుంటున్నారు.

వీరిలో కొందరు కొన్నేండ్లుగా ఓయూలో పనిచేసి ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా రిటైర్ కాగా.. మరి కొంత మంది రిటైర్​మెంట్​కు సిద్ధంగా ఉన్నారు . రాష్ట్రం  ఏర్పాటైన తర్వాత కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొత్తగా నియమించ వద్దని ప్రభుత్వం సూచించడంతో అవసరం మేరకు ఓయూలో పార్ట్ టైమ్ లెక్చరర్స్​ను  కూడా నియమించుకుని క్లాసులు చెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు అధ్యాపకుల సంఖ్యను పెంచాల్సింది పోయి వారిని తగ్గించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ  అగ్రిమెంట్ బాండ్ ప్రకారం ఉద్యోగం నుంచి తీసివేసినా తాను ఎలాంటి అభ్యంతరం తెలియజేయనని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒప్పుకుని సంతకం చేయాల్సి ఉంటుంది . దీని వల్ల తమ ఉద్యోగ భద్రతకు నష్టమని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు. 25 ఏండ్లుగా పనిచేస్తున్న తమను ఇప్పుడు బాండ్ పై సంతకం చేసి ఇవ్వాలని అడగడం ఏంటని వారు ఓయూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాలు 2013  వరకు ఓయూలో జరిగాయని , చివరి నియామకాల వరకు తీసుకున్నా 10 ఏండ్లకు మేరకు మంచి అనుభవంతో ... తగిన అర్హతలతో పనిచేస్తున్నారని వివరించారు. తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా చేస్తే  ఊరుకునేదిలేదని, ఆందోళనలకు సైతం వెనుకాడబోమని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చెబుతున్నారు.

బాండ్ అగ్రిమెంట్ ​నిర్ణయం సరికాదు: యూటీఎస్ నాయకులు

ఓయూ అధికారులు బాండ్ ​అగ్రిమెంట్​ను ప్రవేశపెట్టాలని చూస్తే  ఊరుకోబోమని యూనివర్సిటీ టీచర్స్​అసోసియేషన్(యూటీఎస్) నాయకులు డాక్టర్​ పరశురామ్​, డాక్టర్​ ధర్మతేజ హెచ్చరించారు. ఏండ్లుగా ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పనిచేస్తున్నామని, ఇప్పుడు బాండ్​ను తీసుకురావాలని నిర్ణయించడం సరికాదన్నారు. గతేడాది హెచ్ ఆర్​సీని ఆశ్రయించిన కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ బాండ్​ అగ్రిమెంట్​ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ ​చేస్తూ కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్లు వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నారు.  బాండ్ అగ్రిమెంట్​, బదిలీలు చేపట్టేందుకు  అధికారులు గతేడాది సైతం ఇలాంటే ఉత్తర్వులు జారీ చేయగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ హెచ్​ఆర్​సీని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన హ్యూమన్ రైట్స్ కమిషన్..  ఓయూ అధికారులపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాండ్ అగ్రిమెంట్ నిర్ణయాన్ని పున సమీక్షించాలని  ఆదేశించింది. దీంతో అధికారులు  ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకు న్నారు. కానీ ఈ ఏడాది మళ్లీ  అదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సర్క్యులర్ జారీ చేశారు.