బిల్లుల వసూలుకు మరోదారి లేకనే క్లాస్ రూమ్ లకు తాళం

బిల్లుల వసూలుకు మరోదారి లేకనే క్లాస్ రూమ్ లకు తాళం

కొత్తపల్లి, వెలుగు: ‘‘మన ఊరు – -మన బడి’’ పథకం కింద చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట ప్రైమరీ స్కూల్ లో జరిగింది. ఈ స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్, కాంట్రాక్టర్ శ్రీకాంత్ కు ప్రభుత్వం నుంచి రూ.4.4 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోకపోవడంతో ఆయన స్కూల్ క్లాస్ రూమ్ లకు తాళం వేశారు. ‘‘ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన అంచనాల ప్రకారం పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నేను అప్పు చేసి పనులు పూర్తి చేశాను. వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాను” అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల వసూలుకు మరోదారి లేకనే క్లాస్ రూమ్ లకు తాళం వేశానని, తనకు రావాల్సిన రూ.4.4 లక్షల బిల్లులు మంజూరు చేసేంత వరకు తాళం తీసేది లేదని చెప్పారు.  

కలెక్టర్ హామీతో... 

కాంట్రాక్టర్ స్కూల్​కు తాళం వేయడంతో కొంతమంది పిల్లలు ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన స్టూడెంట్లకు వరండాలో, చెట్ల కింద టీచర్లు పాఠాలు చెప్పారు. తాళం వేసిన విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో శ్రీనివాస్ వెంటనే పాఠశాలకు వచ్చారు. ఈ సమాచారాన్ని డీఈవో, కలెక్టర్ కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్‌‌ రెండ్రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని అధికారులు కాంట్రాక్టర్ కు చెప్పడంతో తాళం తీశారు. ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పనులను పర్యవేక్షించి.. ఆఫ్ లైన్ లో బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు.