కాంట్రాక్టర్ సూసైడ్ ఘటన.. కర్నాటక మంత్రిపై కేసు

కాంట్రాక్టర్ సూసైడ్ ఘటన.. కర్నాటక మంత్రిపై కేసు

మంగళూరు: కర్నాటకలో సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య ఘటనకు సంబంధిం చి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై కేసు నమోదు చేసినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. సంతోష్ సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై కేసు పెట్టామని తెలిపారు. మంత్రి అనుచరులు రమేశ్, బసవరాజ్​లను కూడా నిందితులుగా చేర్చామన్నారు. బెళగాం జిల్లా హిండాల్గాలో రోడ్లు, ఇతర సౌలతుల కల్పనకు  మంత్రి రూ. 4 కోట్ల పనులకు ఆమోదం తెలిపారని, ఈ కాంట్రాక్ట్ తన సోదరుడు సంతోష్​కు వచ్చిందని ప్రశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పనులు పూర్తిచేశాక మంత్రి బిల్లులు మంజూరు చేయలేదన్నారు. మంత్రికి 40% కమీషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తామంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేశారన్నారు. బెళగాంకు చెందిన సంతోష్ పాటిల్ ఉడిపిలోని ఓ లాడ్జిలో మంగళవారం ఉరేసుకున్నడు.  మంత్రి కమీషన్ అడుగుతున్నారంటూ ఆరోపించిన వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోవడంతో దుమారం రేగింది. 

మంత్రిని అరెస్ట్ చేయాలె: కాంగ్రెస్ 
కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి ఈశ్వరప్పపై హత్య, అవినీతి అభియోగాలతో కేసు పెట్టి అరెస్ట్ చేస్తేనే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సంతోష్ ఆత్మహత్యపై ప్రధాని మోడీ, సీఎం బొమ్మై, బీజేపీ చీఫ్ ​నడ్డా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలంటూ ట్వీట్ చేశారు. 

రాజీనామా చెయ్యను: ఈశ్వరప్ప 
తాను ఏ తప్పూ చేయలేదని, మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఈశ్వరప్ప అన్నారు. ఈ ఘటన వెనక కుట్ర జరిగి ఉండొచ్చని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు.