
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు ఎంతోకాలంగా కలగంటున్న మంచిర్యాల, అంతర్గాం బ్రిడ్జికి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగేండ్లుగా ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కు అన్నట్టు మారింది. ఏండ్లు గడుస్తున్న కొద్దీ అంచనా వ్యయం విపరీతంగా పెరుగుతూ సర్కారుకు భారంగా మారుతోంది. ఇటీవల అంచనా వ్యయాన్ని పెంచుతూ టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో అసలు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందా, ఎన్నికల హామీగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ముందుకురాని కాంట్రాక్టర్లు
మంచిర్యాల, అంతర్గాం మధ్య గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు టెండర్లు పిలిచినా ఒక్కరూ ముందుకురాలేదు. బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం రూ.164 కోట్లు శాంక్షన్ అయ్యాయి. రూ.54 కోట్లు భూసేకరణ, ఇతర పనులకు కేటాయించగా, రూ.110 కోట్లతో బ్రిడ్జి పనులకు జూన్‌లో ఈ–టెండర్ పిలిచారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు బడా కన్స్ట్రక్షన్ కంపెనీలతో మాట్లాడినా స్పందన కరువైంది. ఎస్టిమేషన్ కాస్ట్ తక్కువగా ఉండడంవల్ల లాభదాయం కాదని, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల బ్రిడ్జి నిర్మాణం కష్టమవుతుందని.. ఒకవేళ పనులు చేసినా టైమ్‌కు బిల్లులు వచ్చే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని తెలిసింది. దీంతో ఈ నెలలోనే రెండోసారి టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెరుగుతున్న అంచనావ్యయం
2018 అక్టోబర్‌లో శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో నిర్వహించిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో మంచిర్యాల, అంతర్గాం హైలెవల్ బ్రిడ్జిని సీఎం కేసీఆర్ శాంక్షన్ చేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే రూ.125 కోట్లు మంజూరు చేస్తున్నామని, ఏడాదిలోపే బ్రిడ్జి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. ఈ ఏడాది మే లో అంచనా వ్యయాన్ని రూ.125 కోట్ల నుంచి రూ.164 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆఫీసర్లు టెండర్లు పిలిచినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
తగ్గనున్న దూరాభారం
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మంచిర్యాల, పెద్దపల్లి మధ్య దూరాభారం తగ్గుతుంది. ప్రస్తుతం మంచిర్యాల నుంచి పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ వెళ్లాలంటే శ్రీరాంపూర్, ఇందారం, గోదావరిఖని రాజీవ్ రహదారి మీదుగా పోవాలి. గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే మంచిర్యాల, అంతర్గాం, బసంత్‌నగర్ మీదుగా పెద్దపల్లికి చేరుకొని కరీంనగర్, హైదరాబాద్‌కు పోవచ్చు. దీంతో సుమారు 22 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా దాదాపు గంట టైమ్ ఆదా అవుతుంది. మంచిర్యాలతో పాటు మహారాష్ర్టలోని చంద్రాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల వారికి ప్రయాణభారం తగ్గుతుంది. రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ, యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంటుంది.
ఎమ్మెల్యేల వైఫల్యం వల్లే....
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఎమ్మెల్యేల వైఫల్యం వల్లనే బ్రిడ్జి నిర్మాణం కావడం లేదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన మంచిర్యాలలో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల ముందు బ్రిడ్జిని శాంక్షన్ చేస్తూ ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారని, నాలుగేండ్లు గడుస్తున్నా దానికి మోక్షం లభించలేదన్నారు. రాష్ర్టంలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో మళ్లీ బ్రడ్జి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. కాస్ట్ తక్కువుందని, బిల్లులు ఇవ్వరని కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారని, ప్రభుత్వం అంచనా వ్యవయాన్ని పెంచుతూ మళ్లీ టెండర్లు కాల్ చేయాలన్నారు. లేదంటే బీవోటీ సిస్టమ్‌లో నిర్మించాలని సూచిం చారు. ప్రెస్మీట్లో మంచిర్యాల, అంతర్గాం గోదావరి బ్రిడ్జి సాధన సమితి ప్రతినిధులు తుల మధుసూదన్‌రావు, మల్లయ్య, నల్ల నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.