
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వీటి వల్ల కలిగే దుష్ర్పభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు గురువారం (సెప్టెంబర్ 18) హైదరాబాద్ మగ్దూం భవన్‌లో ప్రజానాట్య మండలి నిర్వహించిన వర్క్‌షాప్‌ను జూపల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ కట్టడికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల వద్ద ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కళాకారులకు సూచించారు.
‘‘ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు అప్పులపాలు కావద్దు” అని అన్నారు. కాగా, అంతకుముందు కళాకారులు ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దురా’, ‘కార్పొరేట్ వద్దురా.. ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దురా’ అనే నాటకాలను ప్రదర్శించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ సాంస్కృతిక సలహా మండలి సభ్యుడు పల్లె నరసింహ, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.