మేఘా క్యాంప్ ఆఫీస్ కిరికిరి!

మేఘా క్యాంప్ ఆఫీస్ కిరికిరి!

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-–2లో భాగంగా పెగడపల్లి మండలం నామాపూర్​లో మేఘా కంపెనీ కడుతున్న క్యాంప్ ఆఫీస్​పై వివాదం మొదలైంది. ఎలాంటి పర్మిషన్​ లేకుండా నిర్మాణాలు చేపడుతుండడంపై జీపీ నోటీసులు జారీ చేసింది. సరైన రిప్లై ఇవ్వకుంటే నిర్మాణాలను కూల్చేస్తామని చెప్పడంతో మేఘా కంపెనీ అదంతా ఇరిగేషన్​ ఆఫీసర్లు చూసుకుంటారని తప్పించుకుంటోంది.  కంపెనీ తీరుతో తమ పంచాయతీ రూ.34 లక్షలు నష్టపోతుందని, అందువల్ల  పంచాయతీరాజ్​చట్టం ప్రకారం తాము చర్యలు తీసుకోక తప్పదని సర్పంచ్, ఆఫీసర్లు హెచ్చరించడం ఆసక్తి రేపుతోంది.

మొదలైన లింక్​–2 పనులు 

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మరో 1.10 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు లింక్ –2 పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం కోటిలింగాల నుంచి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లి, బూరుగుపల్లి వద్ద వరద కాలువలో 95 కిలోమీటర్ వద్ద ఒక్క టీఎంసీ నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. ఇందులో భాగంగా కోటిలింగాల నుంచి దమ్మన్నపేట, పెగడపల్లి మండలం దీకొండ, ల్యాగలమర్రి, రాంబద్రునిపల్లి, ఏడుమూటలపల్లి, నామాపూర్, ఎల్లాపూర్, నందగిరి గ్రామ పంచాయతీల పరిధిలో భూసేకరణ చేశారు. పనుల్లో భాగంగా కోటిలింగాల వద్ద పంపు హౌజ్ నిర్మించి పెగడపల్లి మండలం దీకొండ చెరువులోకి పైపు లైన్ ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడ నుంచి ఆయా గ్రామాల మీదుగా నామాపూర్ వరకు ఓపెన్ కెనాల్ నిర్మించి పంపు హౌస్ నుంచి నందగిరి మీదుగా కెనాల్ ద్వారా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి వద్ద వరద కాలువకు కలుపుతారు. ప్రస్తుతం ఈ పనులు ప్రారంభమయ్యాయి. 

కంపెనీ తీరుతో పంచాయతీకి నష్టం 

కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్  కోసం మేఘా ఇంజినీరింగ్​ కంపెనీ, నామాపూర్ జీపీ పరిధిలోని 20  ఎకరాల్లో క్యాంప్ నిర్మాణం చేపట్టింది. దీని కోసం తమ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదని, ఇది పంచాయతీ రాజ్​ చట్టానికి విరుద్ధమని జీపీ ఆఫీసర్లు అంటున్నారు. వెంటనే పర్మిషన్​ తీసుకోవాలని నోటీసులు ఇస్తుండగా, తమకేమీ సంబంధం లేదని, ఏదైనా ఉంటే ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడుకోవాలని కంపెనీ ఆఫీసర్లు రిప్లై ఇచ్చారు. దీంతో ఇటు జీపీ ఆఫీసర్ల కు అటు మేఘా కంపెనీ నిర్వాహకుల మధ్య నోటీసుల యుద్ధం నడుస్తోంది. జీపీ పర్మిషన్ ఇవ్వాలంటే లీజుకు తీసుకున్న వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చర్(నాలా) కన్వర్షన్ చేయాల్సి ఉంది. దీంతో రెవెన్యూ డిపార్ట్ మెంట్​కు అక్కడి భూముల వాల్యుయేషన్ డిమాండ్​ను బట్టి రూ. 1.18 లక్షల ఆదాయం రానుంది. నాలా కన్వెర్షన్​అనంతరం ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ కోసం అక్కడ కడుతున్న10 షెడ్ల ద్వారా రూ.36.-42 లక్షల ఆదాయం వస్తుందని సర్పంచ్​, జీపీ ఆఫీసర్లు అంటున్నారు.  

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు 

నామాపూర్​​లో మేఘా కంపెనీ క్యాంప్ ఆఫీస్​కు జీపీ పర్మిషన్ తీసుకోలేదు. ఈ మేరకు మే 4న, మే 7న  నోటీసులు ఇచ్చాం. కంపెనీ నిర్వాహుకులు ఇరిగేషన్ ఆఫీసర్లను అప్రోచ్ కావాలని రిప్లై ఇచ్చారు. పంచాయతీ చట్టం ప్రకారం టెంపరరీ నిర్మాణాలకు పర్మిషన్ తీసుకోవాలి. మేఘా కంపెనీ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ డిపార్ట్​మెంట్​లో అప్రూవల్ తీసుకున్నాకే జీపీ పర్మిషన్ ఇస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మూడో నోటీస్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటాం.
- చిర్ర తిరుపతి, జీపీ సెక్రటరీ, నామాపూర్,పెగడపల్లి