- స్థానికులకు అన్యాయం స్థానికేతరులకు అవకాశం
- చేతి వాటాలతో మార్కెట్ ఆదాయానికి గండి
సిద్దిపేట/ములుగు, వెలుగు: ములుగు మండలం ఒంటి మామిడి మార్కెట్ లో కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ ల జారీపై రభస నెలకొంది. ఇటీవల షాపుల రెంట్లు చెల్లించడం లేదని 12 మంది కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ లు రద్దు చేసి స్థానికేతరులైన 19 మందికి లైసెన్స్ లు జారీ చేయడం వివాదానికి కారణమైంది. సిద్దిపేట జిల్లాలో 13 మార్కెట్ యార్డులుంటే ఒంటి మామిడి మార్కెట్ యార్డులో మాత్రమే కూరగాయల విక్రయాలు జరుగుతుంటాయి. లక్షల రూపాయల్లో సాగే వ్యాపారంలో కమీషన్ ఏజెంట్లు కీలక పాత్ర వహిస్తారు.
కొత్త లైసెన్స్ ల జారీపై ఆరోపణలు
ఒంటి మామిడి మార్కెట్ యార్డులో మొత్తం 110 మంది కమీషన్ ఏజెంట్లకు లైసెన్స్ లు ఉన్నాయి. వీరిలో 12 మంది ఈ ఆర్థిక సంవత్సరానికి షాపుల రెంట్లు కట్టలేదనే కారణంతో లైసెన్స్ లు రద్దు చేశారు. వారి స్థానంలో కొత్తగా 19 మందికి అధికారులు లైసెన్స్ లు జారీ చేశారు. లైసెన్స్ లు రద్దయిన ఏజెంట్లు స్థానికులు కాగా కొత్తగా లైసెన్స్ లు పొందిన వారిలో అత్యధికులు బోయినిపల్లి మార్కెట్ కు సంబంధించిన వారు ఉన్నారు.
నిబంధనల ప్రకారం ఒక్కో లైసెన్స్ జారీకి రూ.50 వేలతో పాటు అదనంగా వారి నుంచి 5 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే షాపుల రెంట్ కట్టలేదని 12 మంది స్థానికులకు నోటీసులు ఇవ్వకుండా లైసెన్స్ లు రద్దు చేసిన అధికారులు మిగిలిన షాపులకు సంబంధించి గత మార్చి నుంచి ఇప్పటి వరకు రూ.12 .76 లక్షల బకాయిలు ఉన్నా వారి లైసెన్స్ లు మాత్రం కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్ అధికారులు స్థానికులైన 12 మంది లైసెన్స్ లు కక్ష్య పూరితంగా రద్దు చేసి కొత్త లైసెన్స్ ల జారీలో డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
చేతి వాటంతో మార్కెట్ ఆదాయానికి గండి
ఒంటి మామిడి మార్కెట్ యార్డులో 100 వరకు షాపులుంటే అధికారులు కేవలం 33 షాపులకు సంబంధించి మాత్రమే లెక్కలు చూపడం అనుమానాలకు తావిస్తోంది. ఆయా షాఫుల నుంచి మార్కెట్ సెస్ ను వసూలు చేసినా మార్కెట్ ఖాతాలో జమ చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతీరోజు 12 నుంచి 15వందల కూరగాయల వాహనాలు మార్కెట్ కు వస్తుంటాయి. వీటికి మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద టోకెన్లు జారీ చేసిన తర్వాతనే యార్డులోకి అనుమతిస్తారు.
టోకెన్ల ప్రకారం కూరగాయలను అమ్మిన తర్వాత వ్యాపారులు కమీషన్ ఏజెంట్ల నుంచి ఒక శాతం మార్కెట్ సెస్ ను వసూలు చేస్తారు. కాని కింది స్థాయి సిబ్బంది వాహన యజమానుల నుంచి డబ్బులు తీసుకుని టోకెన్లు ఇవ్వకుండా మార్కెట్లోకి పంపడం వల్ల మార్కెట్ సెస్ కు గండిపడుతోంది. మార్కెట్ సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ నేతలు నిరసన సైతం చేశారు.
అవకతవకలపై విచారణ చేపట్టాలి
ఒంటి మామిడి కూరగాయల మార్కెట్ లో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరపాలి. మార్కెట్ అధికారులు కక్ష్య పూరితంగా వ్యవహరించి స్థానికులైన 12 మంది లైసెన్స్లు రద్దు చేసి వారి స్థానంలో స్థానికేతరులకు లైసెన్స్ లు జారీ చేశారు. ఈ విషయం లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినందున ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలి. సిబ్బంది చేతి వాటం వల్ల మార్కెట్ ఆదాయానికి గండి పడుతోంది. - లక్ష్మణ్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు
నిబంధనల ప్రకారమే లైసెన్స్ ల జారీ
ఒంటి మామిడి మార్కెట్ యార్డులో కొత్త లైసెన్స్ లను నిబంధనల ప్రకారమే జారీ చేశాం. పాత ఏజెంట్లు షాపుల రెంట్ కట్టక పోవడంతో వారి లైసెన్స్ లు రద్దు చేసి కొత్త వారికి అవకాశం ఇచ్చాం. మార్కెట్ యార్డు ఆదాయానికి గండి పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.- రేవంత్, మార్కెట్ కార్యదర్శి , ఒంటి మామిడి
