మున్సిపల్ శాఖలో గ్రేడింగ్ లొల్లి..

మున్సిపల్ శాఖలో గ్రేడింగ్ లొల్లి..
  • ఈ విధానం రద్దు చేసిన గత బీఆర్ఎస్ సర్కారు
  • గ్రేడింగ్ లేకపోవడంతో కమిషనర్ల జీతాలు ఆపిన ట్రెజరీ

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్  శాఖలో గ్రేడింగ్  లొల్లి మళ్లీ షురూ అయింది. గత బీఆర్ఎస్  ప్రభుత్వం మున్సిపాలిటీల్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానం లేకపోవడంతో ట్రెజరీ, ఫైనాన్స్  అధికారుల మధ్య సమన్వయ లోపంతో కమిషనర్ల జీతాలను నిలిపివేశారు. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు గ్రేడింగ్ విధానం తీసుకురావాల్సిందే అని (మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్  అర్బన్  డెవలప్ మెంట్) ఎంఏయూడీ అధికారులు కోరుతున్నారు. 

కమిషనర్ల బదిలీలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఒత్తిడితో పోస్టింగ్  ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తుండడంతో  మున్సిపల్  కమిషనర్లకు తిప్పలు తప్పడం లేదు. కమిషనర్ల బదిలీల్లో గ్రేడింగ్  పాటించకపోవడం వల్ల దీన్ని ఆసరాగా చేసుకుని ట్రెజరీ శాఖ  వేతనాలు నిలిపేయడం సమస్యగా మారింది. కాగా.. రాష్ట్రంలో 160 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. 

ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపాలిటీలకు  ఉండాల్సిన గైడ్ లైన్స్ తో జీఓ నంబర్ 218 జారీ చేశారు.  దీని ప్రకారం నగర పంచాయతీల్లో 25 వేల జనాభా, గ్రేడ్ -3 మున్సిపాలిటీలో 40 వేలు, గ్రేడ్-2 మున్సిపాలిటీలో 50 వేలు,  గ్రేడ్- 1 మున్సిపాలిటీలో లక్షకుపైగా జనాభా ఉండాలని నిర్ణయించారు. తర్వాత స్పెషల్  గ్రేడ్, సెలెక్షన్  గ్రేడ్  మున్సిపాలిటీల తర్వాత మున్సిపల్  కార్పొరేషన్  ఏర్పాటు చేసేలా నిబంధనలు రూపొందించారు.  దీని ప్రకారమే మున్సిపల్  కమిషనర్లకు పోస్టింగ్  ఇచ్చేవారు. అయితే, 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేడింగ్  విధానాన్ని రద్దు చేసింది. ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. 

ఎమ్మెల్యేల జోక్యం

మున్సిపల్  శాఖలో కమిషనర్ల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య మున్సిపల్  కమిషనర్ల బదిలీల్లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ కమిషనర్  పోస్టింగ్ విషయంలో ఇద్దరు మాజీ మంత్రులు, ఓ కీలక నేత జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరో నేత తనకు నచ్చిన వ్యక్తినే కావాలని పట్టుబట్టి పోస్టింగ్  ఇప్పించారు. 

మున్సిపల్  వర్సెస్  ట్రెజరీ

పురపాలక శాఖలోని మున్సిపల్  కమిషనర్ల బదిలీల్లో గ్రేడింగ్  విధానం పాటించకపోవడం కారణంగా ట్రెజరీ శాఖ వేతనాలు నిలిపేసింది. గ్రేడింగ్ విధానం లేకపోయినా అధికారుల క్యాడర్ కు తగిన పోస్టింగ్  ఇవ్వకుండా ఉంటే రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని మున్సిపల్  శాఖ అధికారులు చెబుతున్నారు. మరోపక్క మున్సిపాలిటీ గ్రేడింగ్  ఆధారంగానే పోస్టింగ్  ఇవ్వాలని, అలా చేస్తేనే వేతనాలు ఇస్తామని ట్రెజరీ శాఖ అధికారులు చెబుతున్నారు.