
ఆలయ సమీపంలోని ఈద్గాను తొలగించాలని మథుర కోర్టులో పిటిషన్
13.37 ఎకరాలను టెంపుల్‌కే అప్పగించాలని డిమాండ్
మథుర(ఉత్తర ప్రదేశ్): అయోధ్యలోని రామ జన్మభూమి వివాదం ముగియగా, ఇప్పుడు కొత్తగా ఉత్తర ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమిపై వివాదం నెలకొంది. అక్కడున్న శ్రీకృష్ణుడి టెంపుల్ భూమిని ఆక్రమించి షాహీ ఈద్గాను నిర్మించారని మథుర కోర్టులో శనివారం పిటిషన్ ఫైల్ అయింది. శ్రీకృష్ణ విరాజ్ మాన్ తరఫున రంజనా అగ్నిహోత్రి, మరో ఆరుగురు పిటిషనర్లుగా.. లాయర్లు హరిశంకర్ జైన్, విష్ణు జైన్ ఈ పిటిషన్ ఫైల్ చేశారు. శ్రీకృష్ణుడి టెంపుల్కు దగ్గర్లోని ఉన్న షాహీ ఈద్గాను తొలగించి, మొత్తం 13.37 ఎకరాలను టెంపుల్ కే అప్పగించాలని డిమాండ్ చేశారు. యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహీ ఈద్గా ట్రస్టు కమిటీని ప్రతివాదులుగా చేర్చారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ ట్రస్టుకు చెందిన భూమిని ఆక్రమించి ఈద్గాను నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. 1968లో ఈద్గా ట్రస్టు మేనేజ్ మెంట్, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మధ్య మోసపూరిత రాజీ కుదిరిందని పిటిషన్లో పేర్కొన్నారు.
1669-70లో ఆక్రమణ…
మొఘల్ రాజు ఔరంగజేబు తన పాలనా కాలంలో హిందూ దేవాలయాలను కూల్చేయాలని ఆర్డర్ జారీ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మథురలోని కత్ర కేశవ్ దేవ్ ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణుడి టెంపుల్ ను1669–70 కాలంలో ఔరంగజేబు ఆర్మీ ధ్వంసం చేసిందన్నారు. అక్కడ ఈద్గాను నిర్మించారని ఆరోపించారు. ఈద్గాను తొలగించి, శ్రీకృష్ణ జన్మభూమిని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైతే ఉద్యమం ప్రారంభిస్తామని బీజేపీ లీడర్ వినయ్ కటియార్ చెప్పారు. రామ మందిరం, బాబ్రీ మసీదు కేసును మాత్రమే విచారిస్తామని సుప్రీం అప్పట్లో స్పష్టం చేసిందని హాజీ మెహబూబ్ చెప్పారు.