అసని తుఫాను ఎఫెక్ట్‌‌తో చల్లబడిన వాతావరణం

అసని తుఫాను ఎఫెక్ట్‌‌తో చల్లబడిన వాతావరణం
  • రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన చిరు జల్లులు
  • అసని తుఫాన్​ ఎఫెక్ట్‌‌తో చల్లబడిన వాతావరణం
  • రాష్ట్రంలో పలు చోట్ల చిరు జల్లులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌‌ వాతారణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో బుధవారం తేలికపాటి జల్లులు కురిశాయి. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లిలో 2.8 సెంటీమీటర్లు, నీల్వాయిలో 2.2, వనపర్తిలోని శ్రీరంగాపూర్‌‌లో 1.5, నాగర్‌‌కర్నూల్‌‌లోని పెద్ద కొత్తపల్లిలో 1.4, జోగులాంబ గద్వాలలోని భీమారంలో 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీగా తగ్గిన టెంపరేచర్లు
అసని తుఫాన్ ఎఫెక్టుతో రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తొమ్మిది డిగ్రీల మేర తక్కువగా రికార్డయ్యాయి. టీఎస్‌‌డీపీఎస్‌‌ డేటా ప్రకారం ఒక్క ఆదిలాబాద్‌‌ జిల్లా మినహా అన్ని చోట్ల 40డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 35 డిగ్రీల కంటే తక్కువగా టెంపరేచర్స్‌‌ రికార్డయ్యాయి. హైదరాబాద్‌‌లో 33.1 డిగ్రీల మ్యాగ్జిమం టెంపరేచర్‌‌ నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తీవ్ర తుఫాను బుధవారం బలహీనపడి.. మచిలీపట్టణానికి ఆగ్నేయంగా 40 కిలీమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలహీనపడి గురువారం ఉదయం వాయుగుండంగా మారొచ్చని చెప్పారు.