Coolie First Review: 'కూలీ' పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్.. రజనీ మూవీపై ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు

Coolie First Review:  'కూలీ' పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్.. రజనీ మూవీపై ఉదయనిధి స్టాలిన్ ప్రశంసలు

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ' కూలీ ' చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న తమ హీరో సినిమా కోసం థియేటర్ల వద్ద అభిమానులు  చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు కట్టి, డప్పులు, బాణసంచాతో రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో విడుదలకు ఒకరోజు ముందుగానే తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 'కూలీ' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను వీక్షించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.  గురువారం విడుదలకానున్న  'కూలీ ' చిత్రాన్ని  ముందుగానే చూసే అవకాశం నాకు కలిగిందన్నారు ఉదయ్ నిధి.  ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఎంతో అస్వాధించాను. ఈ 'కూలీ' చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

 

రజనీకాంత్ సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో  50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న  సందర్భంగా రజనీకాంత్ కు ఉదయ్ నిధి స్టాలిన్ అభినందనలు తెలిపారు.  'కూలీ' గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మూవీలో నటించిన రజనీకాంత్,  సత్యరాజ్, అమిర్ ఖాన్, నాగార్జున, దర్శకుడు లోకేష్ కనగరాజ్,  శ్రుతి హాసన్, అనిరుద్దీన్ తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ 'కూలీ' సినిమా మొదటి రోజే రూ. 150 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రజనీకాంత్ దేవాగా,   సైమన్ గా నాగార్జున, రాజశేఖర్ గా సత్యరాజ్, కలీషాగా ఉపేంద్ర, ప్రీతిగా శ్రుతిహాసన్, దయాళ్ గా సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.  బాక్సాఫీస్ వద్ద హృతి రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన' వార్ 2'తో  రజనీకాంత్' కూలీ' పోటీ పడుతుంది.  అడ్వాన్స్ సేల్స్ విషయంలో ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి.