కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని కోరారు. ‘విదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ దాచుకోవద్దు. మీరు దాచుకోవాలనుకున్నా అది దాగదు. సిన్సియర్‌గా చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తున్నా. విదేశాల నుంచి వచ్చినొళ్లు బయట తిరగొద్దు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించండి. స్వచ్ఛందంగా మీరే స్థానిక ఆస్పత్రిలో రిపోర్ట్ చేయండి. ఐసోలేషన్ లో ఉంచి చెకప్ చేస్తారు. ఇది మీకు, మీ కుటుంబానికి మంచిది. ఇలా చేస్తే రాష్ట్రం, దేశం, యావత్ మానవాళికే మేలు చేసినవాళ్లవుతారు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. రేపు జనతా కర్ఫ్యూ పాటించడంపై శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రమంతా సర్వే
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిందని, శనివారానికి వైరస్ సోకిన వాళ్ల సంఖ్య 21కి చేరిందని తెలిపారు సీఎం కేసీఆర్. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వాళ్లను ప్రభుత్వం పర్యవేక్షణలో క్వారంటైన్ చేశామని, కానీ ఇతర రాష్ట్రాల్లో దిగి తెలంగాణలోకి వస్తున్న వాళ్ల విషయంలోనే సమస్య తలెత్తుతోందని చెప్పారు. ఇలాంటి వాళ్లంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కరీంనగర్‌లో ఒక్కసారిగా 8 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో అప్రమత్తమయ్యామని, ఈ ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 5247 టీమ్స్‌తో సర్వే చేయిస్తున్నామని చెప్పారు. మార్చి 1 తర్వాత మన రాష్ట్రంలోకి 20 వేల మంది విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 11 వేల మందిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తోందని చెప్పారు.
సమాజానికి ముప్పు తేవొద్దు
ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను అడ్డుకోవచ్చని చెప్పారు సీఎం కేసీఆర్. విదేశాల నుంచి వచ్చినోళ్లు బయట తిరిగి సమాజానికి ప్రమాదం తేవొద్దని కోరారు. ‘మీరంతా కూడా మా బిడ్డలే. దయ చేసి ప్రభుత్వానికి సహకరించండి. మేం అన్ని మార్గాల్లో వివరాలు సేకరిస్తున్నాం. మున్సిపాలిటీ, పంచాయతీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా తీసుకుంటున్నాం. కొన్ని చోట్ల సర్పంచ్‌లు సహకరిస్తున్నారు. ఆ ఊరిలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చినోళ్లుంటే వైద్య అధికారులకు పట్టిస్తున్నారు. ఆ పరిస్థితి కూడా అవసరం లేదు. మీరే స్వచ్ఛందంగా రండి. ఏ లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి వైద్యులు పరీక్షిస్తారు. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచుతారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వెంటనే చెప్పండి. ఆస్పత్రికి తరలిస్తాం. మీరు రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే అంతా చూసుకుంటుంది. కేవలం సామాజిక బాధ్యతతో సమాచారం ఇస్తే చాలు’ అని చెప్పారు సీఎం.
