తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

 తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మహమ్మారి అంతరించినట్లేనని భావిస్తున్న తరుణంలో కేసుల పెరుగుదల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు మళ్లీ హెచ్చరికలు చేస్తు్న్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించకపోతే జరిమానా విధించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. 
ఇక కేసుల విషయానికి వస్తే రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 16,319 మందికి పరీక్షలు చేయగా 155 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా గడచిన 24 గంటల్లో 59 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 907 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. గడచిన 24 గంటల్లో నమోదైన 155 కరోనా కేసుల్లో ఒక్క హైదరాబాదులో 81 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 42, మల్కాజిగిరిలో 11, సంగారెడ్డిలో 8 చొప్పున కేసులు నమోదయ్యాయి.