ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 3వ స్థానానికి చేరుకున్న ఏపీ

అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ర్టం

11 రోజుల వ్యవధిలో లక్ష కేసులు

అమరావతి: ఏ.పిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రోజూ వేలాదిగా కేసులు వెలుగులోకి వస్తుండటంతో పాజిటివ్‌ల సంఖ్య 2లక్షలు దాటేసింది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే లక్ష కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇతర ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అత్యంత వేగంగా 2 లక్షల కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన ఏపీ… ప్రస్తుతం జాతీయ స్థాయిలో మూడోస్థానంలో ఉంది. మార్చిలో జాతీయ స్థాయిలో కింది వరుసలో ఉన్న ఏపీ నాలుగు నెలల వ్యవధిలోనే మూడోస్థానానికి చేరడం రాష్ట్రంలో కరోనా విలయతాండవానికి నిదర్శనంగా చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ వరకూ అదుపులోనే ఉన్న వైరస్‌ జూలై నుంచి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 12న నెల్లూరులో తొలి కరోనా కేసు నమోదయింది. ఆ తర్వాత 19న ప్రకాశంలో రెండో కేసు, 20న విశాఖలో మూడో కేసు గుర్తించారు. మార్చి 31నాటికి కేవలం 44 కేసులే ఉన్నాయి. వీటి సంఖ్య ఏప్రిల్‌ 30న 1,403కు, మే 31న 3042కు చేరింది. జూన్‌ నుంచి రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువైంది. జూన్‌ 30నాటికి 14,595మంది కరోనా బారిన పడ్డారు. ఇక జూలైలో కరోనా బీభత్సం సృష్టించింది. ఆ నెల 15వరకూ రోజుకు వెయ్యి లోపు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత వాటిసంఖ్య నానాటికీ పెరుగుతూ పోయింది. జూలై 15న రాష్ట్రంలో 35,451 కేసులున్నాయి. 20వ తేదీ నాటికి 53,724 కేసులు బయటపడ్డాయి. జూలై 27న కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. మొత్తంగా రాష్ట్రంలో కేసుల నమోదును పరిశీలిస్తే తొలి లక్షల కేసుల నమోదుకు 138 రోజులు తీసుకోగా, రెండో లక్షకు 11రోజులు మాత్రమే పట్టింది. అంటే 11 రోజుల వ్యవధిలోనే కేసులు రెట్టింపయ్యాయి.