ఇవాళ కూడా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే...

ఇవాళ కూడా పెరిగిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే...
  • 63వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా కొత్త కేసులు 12వేలు దాటాయి. వరుసగా రెండో రోజు కొత్త కేసుల సంఖ్య 12వేలు దాటడం ఆందోళన కలిగిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 63వేలు దాటింది. 
గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5 లక్షల 19వేల మందికి పరీక్షలు చేయగా.. 12వేల 847 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం పైనే ఉంటోంది. అత్యధికంగా మహారాష్ట్రలో 4,255, కేరళలో 3,419 కేసులు, ఢిల్లీలో 1,323 కేసులు, కర్ణాటకలో 833 కేసులు నమోదు కాగా.. తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
ఢిల్లీ రాష్ట్ర పరిధిలో 10 రోజుల వ్యవధిలో 7వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 7వ తేదీన 1.92 శాతం ఉన్న పాజిటివిటీ రేటు ఈనెల 15వ తేదీ నాటికి 7.01 శాతానికి ఎగబాకినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
కరోనా మహమ్మారి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4.32 కోట్ల మందికి సోకింది. క్రియాశీల కేసుల సంఖ్య కూడా మళ్లీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో క్రియాశీల కేసుల సంఖ్య 63 వేలకు పెరిగింది. మరో వైపు కరోనా నుంచి గడచిన 24 గంటల్లో 7,985 మంది కోలుకోగా.. 14 మంది మరణించారు. రికవరీ రేటు 98.64 శాతంగా నమోదు అయింది. గడచిన 24 గంటల్లో 15.27 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన కరోనా డోసుల సంఖ్య 195.8 కోట్లుగా నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.