ఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 109 మరణాలు
  • గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణమృందంగం మోగిస్తోంది. ఇవాళ ఒక్క రోజే 109 మంది చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 18 వేల 561 కొత్త కేసులు నమోదయ్యాయి.  రికార్డు స్థాయిలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 16 మంది చనిపోగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పదేసి చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. అలాగే తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనా సోకి చికి్త్స పొందుతూ కోలుకోలేక చనిపోయారు. 
కొత్త కేసుల విషయానికి వస్తే గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73 వేల 749 మందికి పరీక్షలు చేయగా 18 వేల 561 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 2094 మంది, చిత్తూరు జిల్లాలో 1621 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 3152 మందికి, గుంటూరు జిల్లాలో 1639 మందికి, కడప జిల్లాలో 815 మందికి, కృష్ణా జిల్లాలో 396 మందికి, కర్నూలు జిల్లాలో 915 మందికి, నెల్లూరు జిల్లాలో 1282 మందికి, ప్రకాశం జిల్లాలో 1115 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 1287 మందికి, విశాఖపట్టణం జిల్లాలో 2098 మందికి, విజయనగరం జిల్లాలో 962 మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1185మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచని 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 73 వేల 749 మందిని పరీక్షలు చేయడంతో ఇవాళ్టి వరకు రాష్ట్రంలో చేసిన కరోనా శాంపిల్స్ పరీక్షల సంఖ్య ఒక కోటి 80 లక్షల 49 వేల 54కు చేరింది.