రాష్ట్రంలో క‌రోనా త‌గ్గుముఖం

రాష్ట్రంలో క‌రోనా త‌గ్గుముఖం

హైద‌రాబాద్: లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబంధిత అంశాలపై గురువారం మంత్రి కేటీఆర్ ప్రజలతో ట్విట్టర్ వేదికగా సంభాషించారు. ఈ క్ర‌మంలోనే కొవిడ్ కు సంబంధించి నెటిజ‌న్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు కేటీఆర్. రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌పై కూడా ప్రజలు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ సమర్థవంతంగానే కొనసాగుతోందని, ప్రజల అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వెసులుబాటు కల్పించామన్నారు. అయితే కొందరు సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రజల సౌకర్యార్థం ఈ వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు లాక్‌డౌన్ వల్ల కరోనా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. 

ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ రోగులను దోచుకుంటున్నాయని, ఇందుకు సంబంధించి చికిత్స ఖర్చు విషయంలో జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం రూపొందించాలని, చేసిన సూచనకు స్పందించిన కేటీఆర్, ఈ అంశం పైన దృష్టి సారిస్తున్నామ‌న్నారు. కరోనా సోకిన సందర్భంగా మానసిక, శారీరక ఆరోగ్యంపైన అత్యంత ప్రభావం చూపిస్తుందని, ఈ విషయంలో కొవిడ్ ను ఎలా ఎదుర్కొన్నారు, కొవిడ్ వచ్చిన వారికి మీరిచ్చే టిప్స్ ఏమిటని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. సొంత వైద్యం పనికిరాదని వైద్య నిపుణులు సూచించిన ప్రామాణిక పద్ధతుల్లోనే ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు. మానసికంగా బలంగా ఉండాలని, కొవిడ్ రికవరీ తర్వాత ఎలా ఉండాలో ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేసే సోషల్ మీడియా, టీవీ చానల్స్ వంటివాటికి దూరంగా ఉండాలని, వాట్సాప్ నిపుణుల సూచనలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోద్దన్నారు. వీలుంటే వ్యాయామం చేస్తే మంచిదన్నారు.

తనకు కరోనా సోకినప్పుడు వరుసగా ఏడు రోజులపాటు తక్కువ నుంచి అతి ఎక్కువ డీగ్రీల జ్వరం కొనసాగిందని, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కూడా ఉందని… తాను డయాబెటిక్ అయినందున బ్లడ్ షుగర్, హైప‌ర్ టెన్ష‌న్ నియంత్రణ కొంత సవాలుగా ఉండిందని, అయితే డాక్టర్ల సరైన సూచనలు సలహాలతో అధిగ‌మించిన‌ట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ వంటి మందుల సరఫరా విషయంలో ప్రభుత్వమే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు ఇవ్వాలన్న సూచనకు కేటీఆర్ స్పందించారు. ఆక్సిజన్ సరఫరా పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని, సరఫరా విషయంలో దేశం సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రెమిడేసివిర్ మందుల వినియోగంలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తోందని తెలిపారు. అయితే దీనిని వాడమని కోవిడ్ రోగులకు కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ఆక్సిజన్‌ను, రెమిడెసివిర్ ను బ్లాక్ లో అమ్మేవారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని తెలిపిన‌ కేటీఆర్.. ఇలా చేస్తే ఎవ్వ‌రినీ వ‌ద‌లం అని హెచ్చ‌రించారు.