హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న నాగ్ పూర్ ప్రత్యేక బృందం కీలక అప్ డేట్ ఇచ్చింది. అగ్నిప్రమాదంలో 1100 కీలక ఫైల్స్ దగ్దమయ్యాయని స్పష్టం చేసింది దర్యాప్తు బృందం. దగ్దమైన ఫైల్స్ కి సంబంధించిన డేటా రికవరీ కోసం ప్రయత్నించామని.. సదరు కేసుల డేటా రికవరీ కష్టమేనని తేల్చింది దర్యాప్తు బృందం. పలు కేసులకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో కీలక ఫైల్స్ దగ్దమవ్వడం ఆయా కేసులపై ప్రభావం చూపనుంది.
ఫిబ్రవరి 7న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్ సమీపంలో గల ఈ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొన్నారు. మూడు అంతస్తుల బిల్డింగ్ అప్పటికే దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో ఫైర్ ఫైటర్స్ ఆక్సిజన్ సిలిండర్స్ తో లోపలికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో దాదాపు పలు కంప్యూటర్లు, వివిధ నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు, కేస్ ఫైల్స్ పూర్తిగా కాలిపోయాయి. ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.ఎమ్సీబీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
