అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనం గురించి తెలియనిది కాదు. తన నిర్ణయాలకు ఎవరైనా అడ్డు చెబితే కావాలని మళ్లీ మళ్లీ అదే పనిచేసే తత్వం అతనిది. ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ ల పేరుతో విరుచుకుపడిన ట్రంప్ కు.. ఆ దేశ సుప్రీం కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. చట్టసభలను కాదని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇష్టమొచ్చినట్లు సుంకాలు విధించడం కుదరదని.. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన టారిఫ్ లను కొట్టివేసింది.
సుప్రీం కోర్టు తీర్పును తీవ్రంగా తప్పు పట్టిన ట్రంప్.. తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ఎక్కడా తగ్గడం లేదు. అధ్యక్షుడికి ఉండే ప్రత్యేక అధికారాలను వినియోగించి టారిఫ్ లను విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ దేశాల దిగుమతులపై 10 శాతం సుంకాలను విధిస్తూ.. ఫైల్ పై సంతకం చేశారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్స్ పై సంతకం చేయడం ఆనందంగా ఉందంటూ ప్రకటించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 24, ఉదయం 10.31 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది.
10 శాతం సుంకాలకు సంబంధించిన ఫైల్ పై ఓవల్ ఆఫీస్ నుంచి సంతకం చేయడం నాకు గర్వకారణం. ఈ సుంకాలు వెంటనే అమలులోకి వస్తాయి... అంటూ ట్వీట్ చేశారు ట్రంప్. సెక్షన్ 122, ట్రేడ్ యాక్ట్ 1974 ఆధారంగా 10 % గ్లోబల్ టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. 154 రోజులు ఈ సుంకాలు అమలులో ఉండనున్నాయి.
ఇండియాపై ప్రభావం:
అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ట్రంప్ కు ఎదురుదెబ్బే అయినప్పటికీ.. తన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి 10 శాతం గ్లోబల్ టారిఫ్స్ విధించడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఉన్న సుంకాలు.. ప్రస్తుతం ట్రంప్ తీసుకొచ్చిన కొత్త టారిఫ్స్ తర్వాత.. భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ నడుస్తోంది. యూఎస్ సుప్రీం కోర్టు తీర్పుకు ముందు ఇండియాపై మొదట రెసిప్రోకల్ టారిఫ్స్ (పరస్పర సుంకం ) 25% ఉండగా.. రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను సాకుగా చూపించి ఇండియాపై మరో 25% అధిక సుంకాలను విధించారు ట్రంప్. దీని ఫలితంగా అనేక వస్తువులపై 50% వరకు టారిఫ్స్ పెరిగాయి. అందులో ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, కీలకమైన ఖనిజాలు ఉన్నాయి. కొన్ని ఇతర రంగాలకు సంబంధించిన ఎగుమతులపై మినహాయింపులు ఉన్నాయి. ఆ తర్వాత ఇటీవలి కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత టారిఫ్ రేటును 18%కి తగ్గించింది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ అన్ని దేశాల నుండి దిగుమతులపై కొత్త గా10% గ్లోబల్ సుంకాన్ని విధించారు. ఇండియా ఇప్పుడు కొత్త టారిఫ్స్ కింద ఈ 10% సుంకాన్ని ఎదుర్కొంటుందని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం.. ఇప్పటి వరకు ఉన్న 18% శాతం టారిఫ్స్ కు బదులు.. ప్రస్తుతానికి ఈ 10% బేస్‌లైన్ కిందికి సర్దుబాటు చేయబడుతుందని తెలిపారు. అంటే ఇండియా ప్రస్తుతం 10 శాతం టారిఫ్ లు చెల్లించాల్సి ఉంటుంది.
టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు లేదు: సుప్రీంకోర్టు
ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ సుంకాలను రద్దు చేసింది.
అమెరికా రాజ్యాంగ ప్రకారం.. ఇతర దేశాలపై సుంకాలు విధించాలంటే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం అవసరం. కానీ ట్రంప్ ఇలా చేయలేదు. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం) 1977ను ఉపయోగించి వాణిజ్య సుంకాలు విధించింది ట్రంప్ ప్రభుత్వం. వాస్తవానికి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది.
కానీ ట్రంప్ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించాడు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నేషనల్ ఎమర్జెన్సీ కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించుకుని విస్తృత సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని అమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు ఇవ్వదని అమెరికా అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూల్ చేసిన సుంకాలను ట్రంప్ ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
సుప్రీం తీర్పుపై ట్రంప్ ఆగ్రహం:
తమ ప్రభుత్వం విధించిన గ్లోబల్ టారిఫ్‌లను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ తీర్పును ఆయన ‘ఒక అవమానం’ అని అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ అని, దేశ చరిత్రలోనే దురదృష్టకరమైన నిర్ణయమని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాలు విధించే అధికారం కేవలం 'కాంగ్రెస్'కే ఉంటుందన్న కోర్టు వాదనను ట్రంప్ యంత్రాంగం తప్పుబట్టింది.
1977 నాటి అత్యవసర చట్టం అధ్యక్షుడికి ఆ అధికారాన్ని ఇస్తుందని వాదిస్తోంది. అధ్యక్షుడిగా తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి తీసుకున్న అతిపెద్ద నిర్ణయానికి చుక్కెదురు కావడం ట్రంప్ అజెండా కు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
