కరోనా వ్యాప్తి గాలి నుంచే

కరోనా వ్యాప్తి గాలి నుంచే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వారి నుంచి విడుదలయ్యే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలోకి చేరి ఇతరులకు వ్యాపిస్తోందని తెలిపింది. కరోనా సోకిన వ్యక్తులకు మీటరు కంటే దగ్గరగా ఉన్నప్పుడే వైరస్ సోకే ముప్పు ఉంటుందని నిరుడు గైడ్ లైన్స్ ఇచ్చిన కేంద్ర హెల్త్ మినిస్ట్రీ.. తాజాగా ఆ గైడ్ లైన్స్ లో పలు మార్పులు చేసింది. వైరస్ ముప్పు గాలి ద్వారానే ఎక్కువగా ఉంటుందని చెప్తూ ‘‘కొవిడ్ క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్” పేరిట రివైజ్డ్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ వద్దని చెప్పింది. రెమ్డిసివిర్, ఐవర్ మెక్టిన్ మందుల వాడకంపై జాగ్రత్తలు పాటించాలని సూచించింది.  

ఇండ్లు, ఆఫీసుల్లో లోపలి గాలి బయటకు వెళ్లేలా వెంటిలేషన్ బాగుండాలని, లేకపోతే వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని కేంద్రం తెలిపింది. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే వైరస్ గాలిలో ఎక్కువ సమయం ఉంటుందని, మీటరు కన్నా ఎక్కువ దూరం కూడా వైరస్ ప్రయాణించే అవకాశం ఉంటుందని పేర్కొంది. వెంటిలేషన్ తక్కువగా ఉన్న గదుల్లో తుంపర్లు, ఏరోసాల్స్ చాలా త్వరగా ఏర్పడతాయి. గాలిలో ఎక్కువ సమయం ఉండటమే కాకుండా ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తాయి. తుంపర్లు 2 మీటర్ల వరకు, ఏరోసాల్స్ 10 మీటర్ల వరకూ పోతాయి. వీటితో పాటే వైరస్ వ్యాపించే ముప్పు కూడా ఎక్కువవుతుందని కేంద్రం వివరించింది. 

ఆక్సిజన్ అవసరమైనోళ్లకే రెమ్డిసివిర్ 
కరోనా పేషెంట్ పరిస్థితి మధ్యస్తంగా లేదా సీరియస్ గా ఉండి, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అయితేనే రెమ్డిసివిర్ వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. పాజిటివ్ వచ్చిన 10 రోజుల్లోపు మాత్రమే రెమ్డిసివిర్ వాడాలని చెప్పింది. కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవాళ్లకు, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, 12 ఏళ్లలోపు పిల్లలకు వాడరాదని స్పష్టం చేసింది. రెమ్డిసివిర్, ఐవర్‌‌మెక్టిన్‌‌లను అతిగా వాడొద్దని కేంద్రం హెచ్చరించింది. రెమ్డిసివిర్‌‌ను ఎబోలా వైరస్ ట్రీట్‌‌మెంట్ కోసం, ఐవర్‌‌మెక్టిన్‌‌ను పారాసైటిక్ ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు తయారు చేశారని గుర్తు చేసింది. ఏ మందును వాడినా.. సేఫ్టీ, ఎఫికసీ ముఖ్యమని సూచించింది.