వాయిదా పడుతున్నయ్: పెళ్లిళ్లకు అడ్డంపడ్డ కరోనా

వాయిదా పడుతున్నయ్: పెళ్లిళ్లకు అడ్డంపడ్డ కరోనా

షాదీలకు అడ్డంపడ్డ కరోనా
నిర్మల్ జిల్లాలో మూడు పెళ్లిళ్లకు బ్రేక్

నిర్మల్ టౌన్, వెలుగు: కరోనా.. బడులు, గుడులు, ఆఫీసులు, బస్సులు, రైళ్లు.. వేటినీ నడవనిస్తలేదు. ఆఖరికి పెళ్లిళ్లు కూడా జరగనిస్తలేదు. నిర్మల్ జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి పెళ్లిళ్లకు కరోనాతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఎయిర్​పోర్టు నుంచి క్వారంటైన్​కు..

నిర్మల్ మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన యువతితో ఖానాపూర్ మండలం రాజురా గ్రామానికి చెందిన ఓ యువకుడి పెళ్లి శుక్రవారం జరగాల్సి ఉంది. వరుడు దుబాయ్ నుంచి గురువారం హైదరాబాద్ ఎయిర్​పోర్టులో దిగాడు. మిగతా ప్రయాణికులతోపాటు అతడిని క్వారంటైన్ కు పంపారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది.

31 వరకు వద్దు..

నిర్మల్ జిల్లా వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి పెండ్లి ఖానాపూర్ పట్టణంలోని ఓ యువతితో ఈ నెల 22న జరగాల్సి ఉంది. ఆ వ్యక్తి బుధవారం దుబాయ్ నుంచి వచ్చాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ నర్సయ్య.. వెంగ్వాపేట్ కు వెళ్లి అతడితోపాటు కుటుంబ సభ్యులతో చర్చించి.. 31 వరకు పెళ్లి జరపవద్దని సూచించారు. యువతి కుటుంబ సభ్యులతో కూడా తహసీల్దార్ మాట్లాడారు.

ఫ్యామిలీతో మాట్లాడి..

మామడ మండలం కమల్ కోటలో కూడా దుబాయ్ నుంచి ఓ యువకుడు వచ్చాడు. శుక్రవారం అతడి పెండ్లి జరగాల్సి ఉంది.అధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి వాయిదా వేసుకోవాలని కోరారు. నిర్మల్ మండలం వె౦గపేట గ్రామానికి చెందిన ఆరుగురు దుబాయ్ నుంచి రావడంతో ఇంటి నుంచి బయటికి రావద్దని వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది