కరోనా దెబ్బకు ఐపీఎల్ ఖేల్​ఖతం

V6 Velugu Posted on May 05, 2021

ఐపీఎల్​ 14 నిరవధిక వాయిదా
అమిత్​ మిశ్రా, సాహాకు పాజిటివ్​    మైక్​ హస్సీకి  కూడా​

అందరూ భయపడినట్టుగానే జరిగింది..! దేశాన్ని కుదిపేస్తున్న కరోనా.. ఐపీఎల్​పై పంజా విసిరింది..! సాఫీగా సాగుతున్న లీగ్​ను నిరవధికంగా వాయిదా పడేలా చేసింది..! తాజాగా సన్‌‌రైజర్స్‌‌ ప్లేయర్‌‌ వృద్ధిమాన్​ సాహా, అమిత్​ మిశ్రాకు వైరస్​ సోకడం..  హైదరాబాద్​ టీమ్​ మొత్తం క్వారంటైన్​లోకి వెళ్లాల్సి రావడం.. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఐసోలేషన్​లో ఉండటంతో.. బీసీసీఐ తల పట్టుకుంది..! చేసేదేమీలేక ఆటను ఆపేసింది..! ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకు ఓటేసి.. లీగ్​ను సస్పెండ్​ చేసింది..! ఇప్పట్లో నిర్వహించే చాన్స్​ లేకపోయినా.. మరో విండోలో ప్రయత్నిస్తామని చెప్పింది..! 

న్యూఢిల్లీ: అందరూ ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్​ను కరోనా దెబ్బ కొట్టింది. బయో బబుల్​లోనూ  పాజిటివ్​ కేసులు పెరుగుతుండటంతో.. బీసీసీఐ లీగ్​ను నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో  నెల రోజుల పాటు సాఫీగా సాగిన మెగా లీగ్​ వైరస్​ దెబ్బకు మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా సన్​రైజర్స్​ హైదరాబాద్​ వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్​ వెటరన్​ స్పిన్నర్​ అమిత్​ మిశ్రా, సీఎస్కే బ్యాటింగ్​ కోచ్​ మైక్​ హస్సీకి  పాజిటివ్​ వచ్చింది. దీంతో హైదరాబాద్​ టీమ్​ మొత్తం క్వారంటైన్​లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మిగతా ఫ్రాంచైజీల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో బీసీసీఐ మంగళవారం అత్యవసరంగా సమావేశమై లీగ్​ను సస్పెండ్​ చేసింది.  అన్ని ఫ్రాంచైజీలు, బ్రాడ్​కాస్టర్​, ఇతర వాటాదారులు కూడా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ‘టోర్నీని నిరవధికంగా సస్పెండ్​ చేస్తున్నాం. నెక్స్ట్​అందుబాటులో ఉన్న విండోలో మిగతా టోర్నీని కంప్లీట్​ చేసేందుకు ట్రై చేస్తాం. కానీ ఈ నెలలో మాత్రం కాదు’ అని ఐపీఎల్​ చైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ పేర్కొన్నాడు.  60 మ్యాచ్​ల లీగ్​లో ఇప్పటికి 29 మ్యాచ్​లు పూర్తయ్యాయి. మరో 31 మ్యాచ్​లు జరగాల్సి ఉంది.
నాలుగు టీమ్స్​కు ఎఫెక్ట్​..
కరోనా ఎఫెక్ట్​ నాలుగు ఫ్రాంచైజీలపై పడడంతో లీగ్​ను వాయిదా వేయక తప్పలేదు. సోమవారం కేకేఆర్​ఇద్దరు ప్లేయర్లతో పాటు సీఎస్​కే బౌలింగ్​ కోచ్​ బాలాజీ పాజిటివ్​గా తేలాడు. అతనితో కాంటాక్ట్‌‌ దృష్ట్యా చెన్నై టీమ్​ కూడా క్వారంటైన్​లోకి వెళ్లాలని డిసైడైంది. దాంతో, తొలుత బుధవారం జరిగే సీఎస్‌‌కే–రాజస్తాన్‌‌ను రీషెడ్యూల్‌‌ చేశారు. ఆపై, లీగ్​ను వారం రోజుల పాటు వాయిదా వేసి.. ఆ తర్వాతి నుంచి రోజుకు రెండు మ్యాచ్​లు ఆడించాలని బోర్డు భావించిందని సమాచారం. ఆ దిశగా టీమ్​లను ముంబైకి తరలించి అక్కడే మ్యాచ్​లు జరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందట.  హోటల్స్​తో కూడా మాట్లాడినట్లు సమాచారం. కానీ సాహా, మిశ్రాకు వైరస్​ సోకిందని పబ్లిక్​గా తెలిసిపోవడంతో.. బీసీసీఐ, ఐపీఎల్​ జీసీ.. అర్జెంట్​ మీటింగ్​ను ఏర్పాటు చేశాయి. ఆటగాళ్లు, సపోర్ట్​ స్టాఫ్​తో పాటు లీగ్​తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి సేఫ్టీ తమకు ముఖ్యమని చెబుతూ లీగ్​ను సస్పెండ్​ చేశాయి. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్​ను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదు. ప్లేయర్ల సేఫ్టీతో మేం కాంప్రమైజ్​ కాలేం. అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐపీఎల్​ పేర్కొంది. 
ఫారిన్​ ప్లేయర్లను సేఫ్​గా పంపిస్తాం: బ్రిజేష్‌‌
లీగ్​లో పాల్గొంటున్న ఫారిన్​ ప్లేయర్లను సేఫ్​గా వాళ్ల దేశాలకు పంపిస్తామని లీగ్​ చైర్మన్​  బ్రిజేష్​ హామీ ఇచ్చాడు. ఇందుకు అవసరమైన మార్గాలను వెతుకుతున్నామని చెప్పారు. ‘ఇండియాలో ఇప్పుడు డిఫికల్ట్​ సిచ్యువేషన్​ ఉంది. అయినప్పటికీ  బీసీసీఐ తన అన్ని రకాల పవర్స్​ను ఉపయోగించి క్రికెటర్లను వాళ్ల ఇంటికి సేఫ్​గా పంపిస్తుంది’ అని పటేల్​ తెలిపారు.ఇంగ్లండ్​ (11),  ఆస్ట్రేలియా (14), న్యూజిలాండ్ (10)​ సౌతాఫ్రికా (11), వెస్టిండీస్​ (9), అఫ్గానిస్తాన్​ (3), బంగ్లాదేశ్​ (2) ప్లేయర్లను పంపించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం.  
మాల్దీవ్స్​కు ఆసీస్​ క్రికెటర్లు
ఇండియా నుంచి వచ్చే కమర్షియల్​ ఫ్లైట్స్​పై ఈ నెల 15 వరకు ఆస్ట్రేలియా బ్యాన్​ విధించింది.ఈ లోపు ఎవరైనా ఇండియా నుంచి ఆసీస్‌‌లో అడుగు పెడితే జైల్లో పెడతామని అధికారిక ప్రకటన చేసింది.  అయితే దీనిపై ఐపీఎల్‌‌ క్రికెటర్లకు మినహాయింపు ఇవ్వాలని అడిగేందుకు క్రికెట్​ ఆస్ట్రేలియా (సీఏ) ఇష్టపడటం లేదు. అయినప్పటికీ తమ ప్లేయర్లను సేఫ్​గా తీసుకొచ్చేందుకు బీసీసీఐతో కలిసి పని చేస్తామని సీఏ స్పష్టం చేసింది. కాగా,  15 వరకూ స్వదేశం వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆసీస్​ ప్లేయర్లు, సపోర్ట్​ స్టాఫ్స్​, కోచ్​లు.. మాల్దీవ్స్​కు వెళ్లేందుకు ప్లాన్​ చేసుకుంటున్నారు. అక్కడ కొన్ని రోజుల క్వారంటైన్​ తర్వాత ఆసీస్​కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నారు. 
రూ. 2 వేల కోట్ల నష్టం
ఐపీఎల్​ను మధ్యలో ఆపేయడం వల్ల బీసీసీఐ భారీగా నష్టపోతున్నది. సగం మ్యాచ్​లే కంప్లీట్​ కావడంతో దాదాపు 2  వేల నుంచి 2500 కోట్ల వరకు నష్టం వాటిల్లనుంది. ‘ఇప్పటివరకు 24 రోజుల క్రికెట్​ మాత్రమే కంప్లీట్​ అయ్యింది. ఇంకా సగం మ్యాచ్​లున్నాయి. కచ్చితంగా చెప్పాలంటే రూ. 2200 కోట్లు నష్టం రానుంది. ఇందులో బ్రాడ్​కాస్ట్​, స్పాన్సర్​షిప్​ మనీ ఉంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐదేళ్ల కాంట్రాక్ట్​ కింద స్టార్​.. బీసీసీఐకి రూ. 16,374 కోట్లు చెల్లిస్తుంది. అంటే ఏడాదికి రూ. 3269 కోట్లు. ప్రతి సీజన్​లో 60 మ్యాచ్​లు ఉంటాయి కాబట్టి.. ప్రతి మ్యాచ్​కు సుమారు రూ. 54.5 కోట్లు ఇస్తుంది. ఇప్పటివరకు 29 మ్యాచ్​లు కంప్లీట్​ అయ్యాయి కాబట్టి .. రూ. 1580 కోట్లు స్టార్​ చెల్లిస్తుంది. ఫుల్​ టోర్నీ లేదు కాబట్టి మిగతా రూ. 1690 కోట్లు ఇవ్వదు. టైటిల్​ స్పాన్సర్​షిప్​ రూ. 440 కోట్లలో సగం మాత్రం రావొచ్చు. అసోసియేట్​ స్పాన్సర్ల నుంచి రావాల్సిన రూ. 120 కోట్లు కూడా కష్టమే. వీటన్నింటివల్ల సెంట్రల్​ రెవెన్యూ పూల్​ మనీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రాంచైజీలకు కూడా భారీగానే నష్టం వాటిల్లనుంది.

Tagged corona effect, , cricket corona, corona IPL 14 , corona t20 players, ipl postponement, ipl players corona, ipl postpone loss

Latest Videos

Subscribe Now

More News