కరోనా..అంటే ఏంటి?

కరోనా..అంటే ఏంటి?

ఏ నోటి నుండి విన్నా కరోనా మాటే. ఏ వాసన పీల్చినా శానిటైజర్ స్మెల్లే. ఏ ముఖం చూసినా కరోనా మాస్కులే. ‘నరజాతి ప్రస్తుత చరిత్ర సమస్తం.. కరోనా భయానత్వం’ అన్నట్టు తయారైంది ప్రపంచం. ఇంతలా జనంలో కరోనాపై  క్లారిటీ వచ్చాక కూడా.. ఎవరైనా మాకు ఈ  వైరస్  గురించి  తెలియదన్నారంటే ఒకటి వాళ్లు మనతో కామెడీ చేస్తున్నట్టుగా భావించాలి. లేదంటే వాళ్లు ఇప్పుడే ఏ అంగారక గ్రహం నుండో ల్యాండ్ అయినట్టుగా ఫీలవ్వాలి. అలాగే ఫీలయ్యారు ముంబై పోలీసులు. ఎందుకంటే రీసెంట్‌‌గా ఓ హీరోయిన్ వాళ్లకి అలాగే చెప్పింది. ‘బుజ్జిగాడు’తో తెలుగులో బుడిబుడి అడుగులు వేసిన సంజన.. వడి వడి అడుగులకు ఇక్కడ అవకాశం ఇవ్వక పోవడంతో సొంతిల్లు అయిన కర్ణాటక వెళ్లిపోయింది. కాదేదీ కళకు అనర్హం అన్నట్టు… సినిమాలతో పాటు సీరియల్స్‌‌కి కూడా సైన్ చేస్తోంది. భాషా భేదం లేదంటూ ‘ముఝ్‌‌సే షాదీ కరోగే’ అనే హిందీ రియాలిటీ షోలో కూడా నటిస్తోంది.

ఓ వైపు కరోనా దెబ్బకు ప్రపంచమంతా షూటింగులకు ప్యాకప్ చెప్పి, థియేటర్స్‌‌ షట్టర్స్ మూసేసి ఇంట్లోనే పాప్ కార్న్ తింటుంటే.. ఈ రియాల్టీ షో వారు మాత్రం యదేచ్ఛగా షూటింగ్ చేస్తున్నారు. అది గమనించిన పోలీసులు సీన్‌‌లోకి ఎంటరయ్యారు. కానీ సంజనతో పాటు ఆ టీమ్ ఇచ్చిన షాకింగ్ ఆన్సర్ విని వారికి స్పృహ తప్పినంత పనయింది. బిగ్‌‌ బాస్‌‌లాగే ఈ షో కూడా ఒక ఇంట్లో జరుగుతోంది. వారికి బయటి విషయాలేవీ తెలియవు.  ఫొటోలు, వీడియోలు లీక్ అవకూడదని సెల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను సెట్‌‌లో నిషేధించారు. దీంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అందుకే అమాయకంగా ముఖాలు పెట్టి, కరోనా అంటే ఏంటి అని అడిగారట. పనిలో పడి ప్రపంచాన్ని మరిచిపోయిన వారి వృత్తి నిబద్దతని ప్రశంసించాలో.. లేక వారి ఇన్నోసెన్స్‌‌కి నవ్వుకోవాలో అర్థం కాక కాసేపు కన్‌‌ఫ్యూజ్ అయినా… పని చేసింది చాలు పదమంటూ తర్వాత ప్యాకప్‌‌ చెప్పించారు పోలీసులు. ఇంకా ఇలాంటి సీక్రెట్ షూటింగులు ఎన్ని జరుగుతున్నాయో ఏమో!