కరోనా భయం: లక్షణాలు.. పాటించాల్సిన జాగ్రత్తలు

కరోనా భయం: లక్షణాలు.. పాటించాల్సిన జాగ్రత్తలు

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఆ దేశంలో ఇప్పటికే వైరస్ బారినపడి దాదాపు 3 వేల మంది మరణించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో కలిపి 90 వేల మందికి పైగా కరోనా సోకి.. చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర చెప్పారు. సికింద్రాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు తన పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ తరఫున దుబాయ్ వెళ్లినప్పుడు వైరస్ వచ్చిందని, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే చాన్స్ లేదని అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా ఆస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలని సూచించారు.

కరోనా వైరస్ లక్షణాలివి

  • కరోనా బారిన పడిన వారికి జలుబు, దగ్గు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేని పరిస్థితి, తల నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
  • ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.
  • కరోనా సోకకుండా ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీని కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
  • ప్రజలు రోగ నిరోధక శక్తి తగ్గకుండా మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తగ్గితే కరోనా సోకిన వారికి నిమోనియా కూడా వచ్చే ప్రమాదం ఉంది.
  • కరోనా వచ్చిన వారు తుమ్మినప్పుడు తుంపర్లు పడిన వస్తువులపైనా వైరస్ కనీసం నాలుగైదు రోజులు బతికే ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీని లైఫ్ కొంత తగ్గుతుంది. అయితే చల్లటి వాతావరణంలో అయితే దీని జీవిత కాలం 9 రోజుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

  • తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతులు లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఆ వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • ప్రతి ఒక్కరూ తరచుగా చేతులను సబ్బు, లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్స్ తో శుభ్రం చేసుకోవాలి.
  • ఎవరైనా జ్వరం, తీవ్రమైన జలుబు, శ్వాస సమస్యలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండండి.
  • మీకు జ్వరం, జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో సమస్య ఉంటే జాగు చేయకుండా వైద్యుల్ని కలవండి.
  • విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే నేరుగా డాక్టర్లను కలిసి విషయం చెప్పాలి.
  • వీలైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచిది.
  • ముక్కులు, నోరు దగ్గర చేతులు పెద్దగా పెట్టకపోవడం మేలు.
  • విదేశీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు పక్కన ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని నేరుగా టచ్ చేయడం లాంటివి చేయకుండా వీలైనంత దూరంగా ఉండడం మేలు.
  • తమ్ములు, గాలిలో కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున మంచి క్వాలిటీ మాస్క్‌లు వాడడం మంచిది.
  • కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతంలోని వస్తువులు, నేలను కూడా తరచూ క్లీన్ చేయాలి. బ్లీచ్, క్లోరిన్ లాంటి కొన్ని రసాయానాలకు వైరస్ ను చంపే శక్తి కొంతమేర ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
  • అలాగే ఎథనాల్, పెరాసెటిక్ యాసిడ్స్, క్లోరోఫామ్ లాంటివి కూడా కరోనాను అడ్డుకోగలవు. అయితే వీటిని శరీరానికి పూసుకోవడం చాలా డేంజర్. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడొద్దు.

More News:

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కరోనా

కరోనా పేషెంట్ 22న హైదరాబాద్‌కు.. 10 రోజుల తర్వాత గాంధీ ఆస్పత్రికి

నువ్వుల నూనె, వెల్లుల్లితో కరోనాకు చెక్ పెట్టొచ్చా?