కరోనా ఇన్ ​పేషెంట్లు బాగా తగ్గిన్రు

కరోనా ఇన్ ​పేషెంట్లు బాగా తగ్గిన్రు

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న 13,690 మంది రోగులు
10 రోజుల్లో 8 వేలకు తగ్గే చాన్స్​1.59 శాతానికి పాజిటివిటీ రేట్​ 
 టెస్టులు 1.36 లక్షలు.. కేసులు 2,175

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కరోనా పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గింది. సర్కార్​, ప్రైవేట్​ దవాఖాన్లలో ప్రస్తుతం 13,690 మంది కరోనా పేషెంట్లు మాత్రమే ఉన్నారు. 20 రోజుల క్రితం ఈ సంఖ్య 28,450 ఉండగా, మూడు వారాల్లోనే సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం డిశ్చార్జ్​ అయ్యే వాళ్ల సంఖ్య ఎక్కువగా, కొత్తగా వస్తున్న పేషెంట్ల సంఖ్య తక్కువగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో మెజారిటీ హాస్పిటళ్లలో ఆక్సిజన్​, ఐసీయూ, వెంటిలేటర్​‌‌ బెడ్లు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం 6,742 మంది ఆక్సిజన్​ సపోర్ట్​పై ఉండగా, 4,555 మంది పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు. ఇంకో 2,392 మంది మోడరేట్​ సింప్టమ్స్​తో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. మరో వారంపది రోజుల్లో ఇన్​పేషెంట్ల సంఖ్య 8 వేలకు తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 1.59 శాతానికి తగ్గిందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. గురువారం 1,36,096 మందికి టెస్టులు చేస్తే, 2,175 మందికి మాత్రమే పాజిటివ్​ వచ్చిందని తెలిపింది. ఇందులో గ్రేటర్​ హైదరాబాద్​లో 519 కేసులు, జిల్లాల్లో 1,656 కేసులు నమోదైనట్టు వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,87,664కు చేరిందని, 5,53,400 మంది కోలుకున్నారని పేర్కొంది. కరోనాతో గురువారం 15 మంది చనిపోయారని, మృతుల సంఖ్య 3,346కు చేరుకుందని చెప్పింది. 30,918 యాక్టివ్​ కేసులున్నాయని తెలిపింది. గురువారం 98,238 మందికి వ్యాక్సిన్​ వేసినట్టు ప్రకటించింది. 
ఇదీ దవాఖాన్లలో ఇన్​పేషెంట్ల లెక్క
    జనరల్    ఆక్సిజన్​    ఐసీయూ
మొత్తం బెడ్లు    21,846    21,751    11,845
పేషెంట్ల సంఖ్య    2,392    6,742    4,555
ఖాళీలు    19,454    15,009    7,290