
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గత రెండు నెలలుగా కోత విధిస్తున్న ఏపీ సర్కార్ ఈ నెల నుంచి పూర్తి శాలరీ చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగుల హోదాను బట్టి 60 శాతం నుంచి 10 శాతం వరకు కోత పెట్టిన ప్రభుత్వం మే నెల జీతం మొత్తం ఇచ్చేలా ఆర్థిక శాఖ, ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపటి కల్లా సాఫ్ట్ వేర్ అప్ డేట్ పూర్తవుతుందన్నారు. అయతే గడిచిన రెండు నెలల బకాయిలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గడంతో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల జీతాలను మార్చి , ఏప్రిల్ నెలల్లో కొంత శాతం మేర వాయిదా వేసింది జగన్ సర్కారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు 100 శాతం జీతాల చెల్లింపులు వాయిదా వేశారు. ఐఏఎస్, ఐపీఎస్ సహా అన్ని అఖిల భారత సర్వీసు అధికారులకు 60 శాతం మేర జీతం చెల్లింపులు పోస్ట్ పోన్ చేశారు. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతం, నాలుగో తరగతి ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు 10 శాతం మేర జీతాల చెల్లింపులను వాయిదా వేశారు.