ఖమ్మంలో తగ్గని కరోనా

ఖమ్మంలో తగ్గని కరోనా

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా అత్యధిక పాజిటివిటీ రేటు ఉన్న 66 జిల్లాల్లో ఖమ్మం కూడా ఉండటం, పది రోజులుగా ఇక్కడ రోజూ సగటున 340కి పైగా కేసులు నమోదు అవుతుండటం కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు కూల్​గా ఉండటంతో ఖమ్మం నుంచే థర్డ్​వేవ్ మొదలవుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు ఉన్న పాజిటివ్ కేసుల ఆధారంగా కేంద్రం తాజాగా లిస్ట్ రిలీజ్​చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక పాజిటివిటీ రేట్ ఉన్న 66 జిల్లాల్లో మన రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా మాత్రమే ఉంది. ఈ జిల్లాలో పాజిటివ్ రేటు 12.37 ఉందని కేంద్రం వెల్లడించింది. జిల్లాలో కరోనా కంట్రోల్​కు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. అధికారులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.
ఆర్టీపీసీఆర్​టెస్టులు ఎక్కువ చేస్తున్నారట!
ఎక్కువగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండడమే ఖమ్మంలో అత్యధిక పాజిటివిటీ రేటు ఉండడానికి కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లు చేస్తుండగా, హైదరాబాద్‌లో 25 శాతం, ఖమ్మం జిల్లాలో 40 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని అంటున్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదే సంఖ్యలో టెస్టులు చేస్తున్నా.. అక్కడ కేసులు మాత్రం తక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 10 రోజులుగా సగటున 340కు పైగా కేసులు వస్తుండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సగటున 81 కేసులే నమోదవుతున్నాయి. పోలీసులు మాస్క్ ధరించని వారికి రూ.1,000 ఫైన్ వేస్తున్నా చాలా మంది సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. లాక్‌డౌన్ లేకపోవడం, వందల మందితో పెళ్లిళ్లు, ఫంక్షన్లు కామన్ గా మారడం, షాపింగ్ మాల్స్, మార్కెట్లలో జనం రద్దీ పెరగడం వంటివి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి.
ఏపీ బోర్డర్స్‌లో వందల మంది రాకపోకలు
ఏపీని ఆనుకొని ఉన్న సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న విషయాన్ని సర్కారు గత లాక్​డౌన్​ టైంలో గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్​ ఎత్తేసినా, ఈ రెండు నియోజకవర్గాల్లో 10 రోజులపాటు ఆంక్షలు కొనసాగించింది. ఏపీతో పోలిస్తే ఇక్కడ తక్కువ రేట్లకు దొరుకుతున్న లిక్కర్ కోసం రోజూ వందల మంది మన రాష్ట్రంలోకి వస్తున్నారు. దీంతో నిఘా పెంచి, రాకపోకలకు కొంతవరకు బ్రేక్ వేసినా పూర్తిస్థాయిలో కంట్రోల్ కాలేదు.  
జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పే
ఖమ్మంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్న కరోనా పేషెంట్ల సంఖ్య బాగా తగ్గింది. సత్తుపల్లి ఏరియా నుంచి ఎక్కువగా కేసులు ఉంటున్నాయి. రద్దీ ఏరియాల్లో తిరగకపోవడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం వంటివి ప్రతి ఒక్కరూ కొనసాగించాలి. లేదంటే ఖమ్మం జిల్లాలో థర్డ్ వేవ్ ముందే వచ్చే ప్రమాదం ఉంది. - డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి