కరోనా టెస్టులపై టీఆర్ఎస్ vs బీజేపీ

కరోనా టెస్టులపై టీఆర్ఎస్ vs బీజేపీ

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్, బీజేపీ మధ్య కరోనా పంచాయితీ నడుస్తోంది. బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేస్తోంది. మొదట్నించి బీజేపీ రాష్ట్ర నేతలు కరోనా టెస్టులు పెంచాలని చెప్తున్నారు. టెస్టులు పెంచితే వైరస్ ను కట్టడి చేయొచ్చని సూచిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అంటూ టెస్టులు పెంచలేదు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రశ్నించారు. ఐదురోజుల క్రితం బీజేపీ రాష్ట్ర శాఖ నిర్వహించిన ‘జన్‌ సంవాద్’ వర్చువల్ ర్యాలీలో నడ్డా.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నాయని, రాష్ట్రంలో మరణాల రేటు కూడా ఎక్కువ ఉందని అన్నారు. అదే టైంలో రాష్ట్రంలో ప్రతిచోట అవినీతి పేరుకుపోయిందని, డబ్బులు వచ్చే ప్రాజెక్టులు మాత్రమే నిర్మిస్తున్నారని ఆరోపించారు. నడ్డా విమర్శలతో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడికి దిగారు. ప్రగతిభవన్​ నుంచి వచ్చిన ఆదేశాలతోనే వారు బీజేపీపై ఎదురుదాడికి దిగినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పొంతన లేని సమాధానాలు

రాష్ట్రంలో టెస్టులెందుకు పెంచట్లేదనే ప్రశ్నలకు ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సరైన సమాధానం చెప్పడం లేదన్న విమర్శలున్నాయి. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మేరకే టెస్టులు చేస్తున్నట్టు ప్రకటించారు. మర్కజ్ యాత్రికుల ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని గతంలోనే తమ నేత కేసీఆర్ సెంట్రల్‌ను అలర్ట్​ చేశారని ఈటల చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ లో కరోనా ట్రీట్​మెంట్​ చేర్చాలని, లేదంటే ‘ఆయుష్మాన్ భారత్’ను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై రాష్ట్రం నుంచి సమాధానం లేదు. గుజరాత్‌లో వైరస్ ఉదృతంగా ఉందని, దానికి మోడీ బాధ్యత వహిస్తారా అని టీఆర్​ఎస్​ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర సాయంపై భిన్నవాదనలు

కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ టైంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 7 వేల కోట్లు ఇస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం​ పక్కదారి పట్టించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం నిధుల ఖర్చుపై వైట్​పేపర్​ రిలీజ్​ చేయాలని, ఏ ఏ పనులకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాని టీఆర్ఎస్ నేతలు మాత్రం కేంద్ర నిధులు పెద్దగా రాలేదని అంటున్నారు. కేవలం రూ. 214 కోట్లు విడుదల చేశారని చెప్తున్నారు.

సెగ పెట్టిన నిరసన

ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడునడ్డా విమర్శలను తిప్పి కొట్టే పనిలో టీఆర్​ఎస్​ నేతలు ఉండగానే.. బీజేపీ రాష్ట్ర నేతలు సోమవారం రాష్ట్రంలోని సర్కారు హస్పిటల్స్ ముందు నిరసనకు దిగారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందని బీజేపీ మండిపడింది. ఈ నిరసనపై టీఆర్​ఎస్​ హైకమాండ్​ సీరియస్​గా ఉన్నట్లు తెలిసింది. దీంతో మంత్రి తలసాని, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి బీజేపీ నేతలను విమర్శించారు.

370 కి వ్యతిరేకంగా ఆనాడే పోరాడారు