అంబులెన్స్ రాకను చూసి పరారైన కరోనా రోగి

 అంబులెన్స్ రాకను చూసి పరారైన కరోనా రోగి

యశ్వంత్‌పుర: కరోనా సోకిన వ్యక్తి తమ గ్రామంలోకి అంబులెన్స్ రావడం చూసి తప్పించుకుని పరారయ్యాడు. కర్నాటకలోని యశ్వంత్ పుర నియోజకవర్గంలోని  హవేరీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కరోనా పేషెంట్లతో ఒకవైపు ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్న నేపధ్యంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినా కొద్ది మంది కరోనా సోకిన వారు దవాఖానకు పోయేందుకు భయపడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం తమను బలితీసుకుంటుందేమోనని అనుమానంతో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నా చికిత్స కోసం దవాఖానాకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అంతగా ఇబ్బందిపడే పరిస్థితి వస్తే అప్పుడు వెళ్దాం అంటూ వాయిదాలు వేస్తూ పొద్దు గడిపేస్తున్నాడు కబ్బూరు తండాకు చెందిన వ్యక్తి. అందుకే కరోనా సోకినా స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతుండడంతో వైద్యం చేయించుకోవాలన్న ఇరుగుపొరుగు వారి హెచ్చరికలతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడ్ని వెంటనే హోం ఐసొలేషన్ ఉండాలని లేదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని వైద్య సిబ్బందితోపాటు గ్రామస్తులు సూచించినా పట్టించుకోలేదు. మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ భయాందోళన రేపుతున్న నేపధ్యంలో గ్రామస్తులు కొందరు ఇతని గురించి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే అంబులెన్స గ్రామానికి పంపారు. అయితే అంబులెన్స్ రాకను గుర్తించిన కరోనా పాజిటివ్ వ్యక్తి వెంటనే గ్రామంలో ఎవరికీ కనిపించకుండా ఉడాయించాడు.