
ఎటువంటి ట్రావెల్ రికార్డ్ లేనటువంటి ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితోపాటు అతని కుటుంబ సభ్యులను, అపార్ట్‌మెంట్ వాసులను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు.
రాచకొండ కమీషనరేట్ పరిధిలోని నేరెడ్‌మెట్, శ్రీ కాలనీలో నివసించే ఓ వృద్దుడికి కరోనా పాజిటివ్ నమోదయ్యింది. శ్రీ కాలనీలో నివసించే సీఎల్ఎన్ శాస్ర్తి (80) అనే వృద్దుడు ఆరోగ్యం బాగాలేక ఈనెల 10న మిలటరి హాస్పటల్ వెళ్లి, అనంతరం మెడిక్యూర్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. కరోనా అనుమానం రావడంతో 12వ తేదీన గాంధీ హాస్పిటల్‌లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేయగా.. తిరిగి అక్కడ నుండి నేరుగా మెడిక్యూర్ హాస్పిటల్‌కి వెళ్లారు.
అక్కడ పరిశీలించిన డాక్టర్లకు మరోసారి అనుమానం రావడంతో వెంటనే నిమ్స్ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించారు. శుక్రవారం రాత్రి పాజిటివ్ రావడంతో మల్కాజిగిరి డాక్టర్లు.. వృద్ధుడు శాస్ర్తితోపాటు అతని కుటుంబ సభ్యులను, అదే అపార్ట్‌మెంట్లో నివసించే సుమారు 35 మందిని టెస్ట్‌ల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాలనీనుండి ఎవ్వరు బయటకు వెళ్లకుండా, బయట నుండి ఎవ్వరు లోపలికి రాకుండా ఏర్పాట్లు చేశామని మల్కాజిగిరి డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ రెడ్డి కుమారి తెలిపారు.