తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్

తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ టెస్టులు నిర్వహించారు.

అయితే సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజే అసెంబ్లీ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది.  అసెంబ్లీ ఆవరణలో పాస్‌లు జారీ చేసే కౌంటర్లో సేవలు అందించే సిబ్బందిలో ఒక ఉద్యోగికి ఇవాళ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా భయం పట్టుకుంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కరోనా పాజిటివ్ కేసు బయటపడటం సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.

ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.