కరోనా వ్యాప్తి తీవ్రత.. ఫ్లూ కన్నా తక్కువే

కరోనా వ్యాప్తి తీవ్రత.. ఫ్లూ కన్నా తక్కువే
  • కరోనా వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన వెంటనే వ్యాపించదు

కరోనా వైరస్ ఇన్‌ఫెక్ట్ అయిన వెంటనే వారి నుంచి మరొకరికి సోకే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఫ్లూ కన్నా కరోనా వ్యాప్తి సామర్థ్యం, తీవ్రత తక్కువని వెల్లడించింది. ‘ఫ్లూ సోకిన వెంటనే దాని తీవ్రత పెరిగి వ్యాధిగ్రస్తులు కాని వారి ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అయితే కరోనా విషయంలో వైరస్ ఇన్‌ఫెక్ట్ అయినా.. వెంటనే వారి నుంచి మరొకరికి సోకదు’ అని వివరించింది. అయితే డెత్ రేట్ విషయంలో ఫ్లూ కన్నా కరోనా వైరస్ వల్లే ఎక్కువగా ఉందని తెలిపింది. సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాల వల్ల 1 శాతం కన్నా తక్కువగా మరణాలు ఉన్నాయని, కరోనా విషయంలో మాత్రం 3.4 శాతం మరణాలు సంభవించాయని పేర్కొింది. దీనికి కారణం సీజనల్ ఫ్లూ తరచూ వస్తుండడంతో మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ఎదుర్కొనే శక్తిని ఏర్పరుచుకుందని, కానీ కరోనా విషయంలో వైరస్‌తో పోరాడగలిగే ఇమ్యూనిటీ వ్యవస్థ లేదని చెప్పింది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని, పూర్తి స్థాయిలో దాని గురించి త్వరలోనే అవగాహన వచ్చే చాన్స్ ఉందని అన్నారు WHO చీఫ్ టెడ్రోస్. అన్ని రీసెర్చ్ సెంటర్ల నుంచి డేటా అందుతోందని, వైరస్ ఎలా పుట్టింది, వ్యాప్తి ఎలా జరుగుతోందన్న కారణాలపై మరిన్ని వివరాలు తెలుస్తున్నాయని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అందిన వివరాలు ఏంటన్నది ఆయన వెల్లడించలేదు.