పిల్లల్లో కరోనా లక్షణాలు ఎక్కువ రోజులుండవ్

పిల్లల్లో కరోనా లక్షణాలు ఎక్కువ రోజులుండవ్


మహా అయితే ఆరు రోజులేనంటున్న బ్రిటన్​ సైంటిస్టులు
లండన్​: పిల్లల్లో కరోనా లక్షణాలు ఎక్కువ రోజులుండవని తేలింది. ఎక్కువలో ఎక్కువ కేవలం ఆరు రోజుల్లో లక్షణాలన్నీ పోతాయని వెల్లడైంది. రెండు నెలలకుపైగా లక్షణాలుండడం చాలా అరుదని తేల్చింది. బ్రిటన్​లోని కింగ్స్​ కాలేజ్​ లండన్​ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘జో కొవిడ్​ స్టడీ’ అనే స్మార్ట్​ ఫోన్​ యాప్​ ద్వారా 5 నుంచి 17 ఏండ్ల వయసున్న రెండున్నర లక్షల మంది పిల్లల హెల్త్​ను గత ఏడాది సెప్టెంబర్​ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు పరిశీలించారు. ఆ కాలంలో 1,734 మంది పిల్లలకు కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. ఎక్కువ మందిలో సగటున ఆరు రోజులే లక్షణాలున్నాయని, కేవలం మూడు లక్షణాలే కనిపించాయని నిర్ధారించారు. కరోనా ముప్పు కూడా తక్కువే ఉన్నట్టు తేల్చారు. కరోనా సోకిన చిన్నారులు నెలలోపే కోలుకున్నారని, అతి తక్కువ మంది మాత్రమే నెల తర్వాత కూడా ఇబ్బంది పడ్డారని గుర్తించారు. వారిలో కూడా రెండు లక్షణాలే ఉన్నాయని స్టడీలో తేల్చారు. కరోనా సోకినోళ్లలో కేవలం 2 శాతం మంది పిల్లలకే రెండు నెలలకుపైగా లక్షణాలున్నట్టు గుర్తించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లతో పోలిస్తే 12 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లల్లోనే లక్షణాలు ఎక్కువ కాలం ఉన్నాయని 
సైంటిస్టులు తేల్చారు.