పాజిటివ్.. కాదు నెగెటివ్

పాజిటివ్.. కాదు నెగెటివ్

ఓ కుటుంబంలోని వ్యక్తి నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా, కరోనా అనే అనుమానంతో వారి కుటుంబసభ్యులు ఏడుగురికి పరీక్షలు నిర్వహించారు. ఐదుగురికి కరోనా సోకిందని హోం క్వారంటైన్లో పెట్టి చికిత్స అందించారు. కానీ మరుసటి రోజే ఐదుగురికి నెగెటివ్ అంటూ వారి ఫోన్లకు మెసేజ్ వ‌చ్చింది. రెండు రోజుల వ్యవధిలో ఓసారి పాజిటివ్, మరోసారి నెగెటివ్ ఎలా సాధ్యం అవుతుందని కుటుంబీకులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన ఓ వ్యక్తికి క్యాన్సర్ఉండడంతో డిసెంబర్2019లో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆప‌రేష‌న్ చేశారు. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆసుపత్రిలో మరోసారి ఆపరేషన్ నిర్వహించారు. జులై 10న కరీంనగర్ లోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ కుట్లు తీయించారు. ఈ నెల 15న ఉదయం బీపీ తక్కువ కావడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆక్సిజ‌న్ పెట్టి సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి పేషేంట్ చనిపోయాడని, వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాలని డెడ్ బాడీని అప్పగించారు. ఓ పాత అంబులెన్స్ఇవ్వగా కుటుంబసభ్యులే స్వయంగా అంబులెన్స్ లోకి ఎక్కించి వేములవాడకి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మరుసటి రోజు 16న అనుమానంతో మృతిచెందిన వ్యక్తి కుటుంబసభ్యులు ఏడుగురికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఐదుగురికి కరోనా పాజిటీవ్ వచ్చిందంటూ

17న హోం క్వారంటైన్లో పెట్టారు. 18న రాత్రి కరోనా నెగెటివ్ అంటూ వారి పేర్లతో సహా మెసేజ్లు రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఎందుకు ఇలా మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని డాక్టర్లను అడిగితే కరోనా పాజిటివ్ నిజమేనని, వారికి వచ్చిన మెసేజ్లు తప్పని పేర్కొంటున్నారు.

మానసిక వేదనకు గురవుతున్నాం

కరోనా పాజిటివ్ అని మమ్మల్ని ఇంట్లో పెట్టి చికిత్స అందించారు. అయితే శాంపిల్స్ కలెక్ట్ చేసిన మెసేజ్లాగే కరోనా నెగెటివ్ అని మరుసటి రోజే మెసేజ్వచ్చింది. అధికారులు మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇంట్లో ఉండగా ఇంటి పక్కనవారు కనీసం తలుపులు తీయనియ్యడం లేదు. ఇంట్లో గాలి ఆడడం లేదు. కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదు. మేం ఎలా నమ్మేది. ప్రభుత్వం అసలు ఏం చేస్తోంది. మాకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు.

మెసేజ్లతో సంబంధం లేదు

వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది నిజమే. కరోనా నెగెటివ్ అంటూ వచ్చిన మెసేజ్లతో మాకు సంబంధం లేదు. కరోనా పాజిటివ్ అయినా నెగెటివ్ అంటూ హైదరాబాద్ నుంచి మెసేజ్లు వస్తుంటాయి. వీటితో మాకు సంబంధం లేదు. మెసేజ్లు ఎక్కడ నుంచి వచ్చాయోననే విషయమై ఎంక్వైరీ చేస్తున్నాం.
– డా. సుమన్మోహన్రావు, జిల్లా వైద్యాధికారి