
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 998 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో 961మంది లోకల్స్ కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 36 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారీగా 14 మంది కరోనా వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. కర్నూలులో ఐదుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు మరణించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 232కి పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 8,422 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10043 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
భారీగా టెస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తోంది. తొలి నుంచి టెస్టింగ్ సామర్థ్యం పెంచుకుంటూ వచ్చింది ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో 20,567 శాంపిల్స్ పరీక్షించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 10,17,140 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అందులో 9,98,443 శాంపిల్స్ నెగటివ్ వచ్చాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 1.8 శాతంగా ఉంది.