వలస కూలీలు, స్టూడెంట్లకు టెస్టులు చేసి సేఫ్​గా పంపండి

వలస కూలీలు, స్టూడెంట్లకు టెస్టులు చేసి సేఫ్​గా పంపండి

హైదరాబాద్, వెలుగు: నెల రోజులకుపైగా లాక్​డౌన్​లో చిక్కుకుపోయి ఇప్పుడు సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అన్ని టెస్టులు చేసి జాగ్రత్తగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్​లైన్స్​ రిలీజ్​ చేసింది. ఈ మేరకు సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి రెవెన్యూ, మెడికల్, పోలీసు అధికారులతో కూడిన జాయింట్​ టీమ్​ ఇంటర్​ స్టేట్​ బార్డర్​కు 2 లేదా 3 కిలోమీటర్ల ముందు కరోనా టెస్టులు చేయాలని సూచించింది. స్క్రీనింగ్ చేసే టీమ్​లు 24 గంటలపాటు పనిచేయాలని, టెస్టుల సమయంలో 5 నిమిషాల కంటే ఎక్కవ సేపు జనం నిలబడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. స్క్రీనింగ్​లో కరోనా లక్షణాలు లేనట్టు తేలితే వారికి ప్రభుత్వం సూచించిన ఫార్మాట్ లో మెడికల్​ సర్టిఫికెట్​ జారీ చేయాలని పేర్కొంది. వేరే రాష్ట్రాలకు పోతున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లతోపాటు వాళ్లు వెళ్తున్న వెహికల్స్​కు పర్మిట్​ ఇవ్వాలంది. ఆ వెహికల్​లో ఎంత మంది వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలు స్పష్టం చేయాలని పేర్కొంది. వెహికల్​ ప ర్మిట్​పై జిల్లా కలెక్టర్ సంతకం, స్టాంప్, జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూం ఫోన్ నంబర్, తేదీ ఉండాలని సూచించింది. ఇక మెడికల్​ సర్టిఫికెట్​లో వ్యక్తులు, ఫోన్ నంబర్లతోపాటు జిల్లా మెడికల్ అధికారి (డీఎంహెచ్ వో) పేరు, సంతకం, స్టాంప్, జిల్లా కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు ఉండాలని స్పష్టం చేసింది. ఈ గైడ్ లైన్స్ ను తప్పకుండా పాటించాలని కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించింది.