మరో 6 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స నిషేధం

మరో 6 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స నిషేధం

హైదరాబాద్: కరోనా చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వహించారని తేలడంతో రాష్ట్రంలో మరో ఆరు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం నిషేధం వేటు వేసింది. ఇప్పటి వరకు ఉన్న రోగులందరికీ చికిత్స కొనసాగించాలని.. కొత్త కరోనా రోగులను చేర్చుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా చికిత్స పేరుతో దందాలు నిర్వహిస్తూ.. రోగులను అడ్డగోలుగా నిలువుదోపిడీ చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలకు నిద్రలేచిన సర్కార్ మూడ్రోజుల క్రితం ఎట్టకేలకు 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు దారుల అనుమానాలను షోకాజ్ నోటీసులలో తెలియజేయగా సరైన జవాబు రాకపోవడంతో సోమవారం మరో ఆరు హాస్పిటల్స్ కు కరోనా చికిత్సను రద్దు చేస్తూ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. 

1.పద్మజ హాస్పిటల్, Kphb కాలనీ హైదరాబాద్.
2.లైఫ్ లైన్ మెడిక్యుర్ హాస్పిటల్, అల్వాల్.

3. మ్యాక్స్ కేర్ హాస్పిటల్, హన్మకొండ.

4.Tx హాస్పిటల్, ఉప్పల్.

5.లలిత హాస్పిటల్, వరంగల్.
.6. శ్రీ సాయిరాం హాస్పిటల్, సంగారెడ్డి. 

ఈ ఆరు ఆస్పత్రులపై నిషేధంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 16 హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ రద్దు  చేసినట్లయింది. ఇప్పటి వరకు 105 హాస్పిటల్స్ మీద 166 కంప్లైంట్స్ వచ్చాయి. బంజారాహిల్స్ విరించి ఆస్పత్రిలో కరోనా రోగి బంధువు గొడవతో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్న విమర్శలు చెలరేగడంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించి 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ చర్యల నేపధ్యంలో బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుండి 64 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు రాగా.. ఈ రెండు రోజుల్లోనే ఆస్పత్రుల సంఖ్య 105కు చేరుకోగా ఫిర్యాదులు కూడా 166కు చేరుకున్నాయి. చాలా చోట్ల నిర్దిష్ట ఆధారాలు లేవంటూ అధికారులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులను ఆశ్రయిస్తూ కొందరు.. మరికొందరు కోర్టుల్లో ప్రైవేటు కేసులు దాఖలు చేయడం ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.