పైసల కోసం తండ్లాట: సర్కారు నుంచి సాయం కరువు

V6 Velugu Posted on Jul 25, 2021

  • ఏ దిక్కు లేక ఫైనాన్స్​ కంపెనీల ముందు జనం క్యూ
  • వెంటాడుతున్న కరోనా కష్టాలు.. సర్కారు నుంచి సాయం కరువు
  • ఇల్లు గడిచేందుకు కొందరు.. వ్యాపారాల కోసం ఇంకొందరు 
  • చిట్​ఫండ్స్​​ను ఆశ్రయిస్తున్నరు.. మైక్రో ఫైనాన్స్​, చిట్​ఫండ్స్​ బిజినెస్ డబుల్

హైదరాబాద్​లోని జియాగూడకు చెందిన సుదర్శన్  కరోనాకు ముందు ఐస్​క్రీమ్ పార్లర్​లో  పని చేసేవాడు. నెలకు రూ. 20 వేల జీతం వచ్చేది. దాంట్లోంచి 3 వేలు చిట్టీ కట్టేవాడు. కరోనా ఎఫెక్ట్​తో  ఉద్యోగం పోయింది. అతికష్టంగా బతుకు బండి సాగిస్తున్నడు. పిల్లల స్కూలు ఫీజులతోపాటు కొన్ని ఖర్చుల కోసం చిట్టీ ఎత్తుకుందామనుకున్నడు. అక్కడ కూడా పోటీ పడుతున్నోళ్లు మస్తు మంది ఉన్నరు. దీంతో తనకు రాదని డిసైడయ్యి ఫైనాన్స్​ కంపెనీలో అప్పు  చేసిండు. 
హైదరాబాద్​లోని లంగర్​హౌజ్​లో  పూల వ్యాపారం చేసే సుజాత జీహెచ్ఎంసీ ఇచ్చే లోన్ కోసం చాలా రోజుల్నుంచి ఎదురుచూస్తోంది. ఆఫీసర్లు ఈ రోజు ఆ రోజు అని తిప్పుతుంటే విసిగిపోయి డైలీ ఫైనాన్స్​లో  పది వేల రూపాయలు తీసుకుంది. రోజుకు వంద రూపాయలు వడ్డీ కడుతూ వ్యాపారం నెట్టుకొస్తున్నది.

హైదరాబాద్, వెలుగు: కరోనాతో కష్టాలపాలైన జనం ఏ దిక్కులేక మైక్రోఫైనాన్స్, చిట్​ఫండ్స్​ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఇల్లు గడువక కొందరు.. పాణం మంచిగలేక దవాఖాన్లలో చూపెట్టుకునేటందుకు ఇంకొందరు.. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేటందుకు మరికొందరు..  ఇట్లా అనేక మంది ఫైనాన్స్​ కంపెనీల ముందు క్యూ కడుతున్నారు. సర్కారు నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఎక్కువ వడ్డీకైనా వాటివైపే మొగ్గుతున్నారు. ‘‘ఎంతొస్తే అంత, మాకు పైసలు ఇస్తే చాలు’’ అంటూ బతిమిలాడుకుంటున్నారు. దీంతో మైక్రోఫైనాన్స్, చిట్​ఫండ్స్​ కంపెనీలకు  గిరాకీ పెరిగింది. ఏడాదిన్నర కింద పెద్దగా ఆదరణ లేని ఫైనాన్స్​ కంపెనీల్లోనూ ఇప్పుడు మస్తు బిజినెస్​ నడుస్తోంది. ఎన్నడూ ఫైనాన్స్​ తీసుకోని వాళ్లు కూడా ఇప్పుడు చేతులు చాచాల్సివస్తోంది.  
బయట అప్పు పుట్టక
కరోనాతో చితికిన బతుకులు ఎన్నో. నిరుడు ఫస్ట్​ వేవ్​ లాక్​డౌన్​లో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఉద్యోగులు, బడా వ్యాపారులు ఈ నష్టాన్ని తట్టుకొని నిలవగలిగారు. కానీ చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు మాత్రం బాగా దెబ్బతిన్నారు. ఇందులో కొందరు దాచుకున్న డబ్బుతో కొంతకాలం బతుకుబండి నడిపారు. 
హైదరాబాద్ సిటీలో ఏడాదిన్నర కింద కరోనాకు ముందు ప్రతి నెలా రూ. 500 కోట్ల దాకా మైక్రోఫైనాన్స్​ బిజినెస్​ నడిచేది. రోజూ రూ. 16 కోట్ల నుంచి 17 కోట్ల దాకా లావాదేవీలు ఉండేవి. ఇప్పుడవి రూ. 30 కోట్ల నుంచి 35 కోట్లకు చేరాయి. అంటే నెలకు దాదాపు రూ. వెయ్యి కోట్ల మైక్రోఫైనాన్స్​ బిజినెస్​ నడుస్తోంది. చిరు వ్యాపారాలు ఏ ఆధారం లేక డైలీ ఫైనాన్స్​ను ఆశ్రయిస్తున్నారు. గతంలో లాభాల్లోంచి కొన్ని డబ్బులు పెట్టుబడిగా మిగుల్చుకొని వ్యాపారం చేసేవాళ్ల దగ్గర కూడా కరోనా వల్ల చేతిలో చిల్లిగవ్వా లేక డైలీ ఫైనాన్స్​నే నమ్ముకుంటున్నారు.   రైతు బజారులో గతంలో 20 మంది డైలీ ఫైనాన్స్ మీద ఆధారపడేవాళ్లుంటే.. ఇప్పుడు వారి సంఖ్య 40కి చేరింది. ఇందులో ఒక్కొక్కరు రూ. 5 వేల నుంచి 50 వేల వరకు తీసుకుంటున్నారు. డైలీ ఫైనాన్స్​లో వడ్డీ మరీ ఎక్కువ. అయినా హైదరాబాద్​లో 4 లక్షల మంది దీనిపైనే ఆధారపడి బతుకుబండి నడిపిస్తున్నారు.

మరికొందరు దాచుకున్న బంగారాన్ని కుదువ పెట్టారు. చిన్న చిన్న పనులు చేసి పొట్టపోసుకునే ప్రయత్నం చేశారు. ఫస్ట్ వేవ్​ అన్​లాక్​లో  జీవితాలు గాడినపడతాయని భావించారు. కానీ సెకండ్ వేవ్ వచ్చి మళ్లీ లాక్​డౌన్ విధించడంతో చాలా మందిపై కోలుకోలేని దెబ్బ పడింది. ఇంటి కిరాయిలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. పరిచయస్తులు, బంధువుల దగ్గర కూడా పైసా పుట్టడం లేదు. అందరి కష్టాలు ఒకే రకంగా ఉండడంతో వడ్డీలెంతైనా నాలుగు డబ్బులు చేతుల పడితే చాలా అన్నట్లయింది పరిస్థితి. పిల్లలకు స్కూళ్లు కూడా స్టార్ట్ కావడంతో ఫీజుల చెల్లింపు కూడా అదనపు భారమైంది. దీంతో ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్​లే  ఆధారమని వాటి చుట్టూ  జనం తిరుగుతున్నారు. కొత్తగా అప్పు చేసేవాళ్లు, చిట్టీల పేరుతో చిన్న మొత్తాలు జమచేసుకున్నవాళ్లు, కొత్త చిట్టీలు కట్టి వాటిని వెంటనే ఎత్తేసుకుందామనుకునే వాళ్లతో కంపెనీల బ్రాంచీలన్నీ కిటకిటలాడుతున్నాయి
చిట్​ఫండ్​ లావాదేవీలు రూ. 8 వేల కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా 500 నుంచి 600 చిట్​ఫండ్  కంపెనీలున్నాయి. వీటికి మూడు వేల బ్రాంచీలున్నాయి. ఇందులో పెద్ద కంపెనీల బ్రాంచీలు వెయ్యి వరకు ఉంటాయి. ఈ మొత్తం కంపెనీల ద్వారా గతంలో నెలకు రూ. 5 వేల కోట్ల లావాదేవీలు జరిగేవి. ఇప్పుడది రూ. 8 వేల కోట్లకు చేరింది. కస్టమర్లలో చాలా మంది ఒక చిట్టీ పూర్తి కాగానే మరో చిట్టీని వేస్తూ సేవింగ్స్ చేసుకుంటారు. సాధారణంగా ఎమౌంట్​ను బట్టి మెజారిటీ చిట్టీలు 40 నుంచి 50  నెలల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఏడాది, ఏడాదిన్నర వరకు చిట్టీ కావాలనుకునే వారి సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. ఇండ్ల వద్ద పరిచయస్తులతో వేసుకునే చిట్టీల పరిస్థితి కూడా ఇదే. అయితే కరోనా కష్టకాలంలో తమకు వెంటనే చిట్టీ కావాలని అడుగుతున్న వారి సంఖ్య పెరిగింది. 
చిట్టీలు నడిపెటోళ్ల దగ్గరికీ క్యూ
చిట్​ఫండ్స్​లో  రెండు రకాలున్నాయి. ప్రైవేటు లైసెన్స్​డ్​  చిట్ ఫండ్  కంపెనీలను కొందరు బ్యాంకుల్లా సేఫ్ అని భావిస్తారు. రెండో రకం.. ఇంటి చుట్టుపక్కల వాళ్లు, పరిచయస్తులు కలిసి వేసుకునే చిట్టీలు. వీటిలో మోసం జరుగుతుందేమోననే భయం ఉన్నా ప్రస్తుతం ఈ చిట్టీలకు బాగా డిమాండ్ ఉంది. చుట్టుపక్కలవాళ్లో, పరిచయస్తులో చిట్టీలు నడుపుతున్నారని తెలిస్తే జనం వారిని ఆశ్రయిస్తున్నారు. ముందుగల్ల తామే చిట్టీ పాడుకుంటామంటూ పోటీపడుతున్నారు. మైక్రో ఫైనాన్స్​లో వడ్డీ ఎక్కువ. చిట్​ఫండ్స్​లో  కొంత బెటర్. ముందుగా చిట్​ఫండ్స్​లో ప్రయత్నించి.. వీలు కాకపోతే మైక్రో ఫైనాన్స్ తీసుకొని పనులు నడిపిస్తున్నారు. 
బండ్లగూడ జాగీర్​కు చెందిన రాఘవేందర్ రిసార్ట్​లో పని చేసేవాడు. వచ్చిన దాంట్లో కొంత సేవింగ్​ కోసమని చిట్టీ కట్టేవాడు. కరోనా ఎఫెక్ట్​తో  ఉద్యోగం పోయింది. ఇల్లు గడువక చిట్టీనైనా ఎత్తుకుందా మనుకుంటే అది దక్కే పరిస్థితి లేదు. చాలా మంది చిట్టీలను ఎక్కువకు పాడుకుంటుండడంతో ఇతనిలాగే ఇబ్బంది పడ్తున్నోళ్లు ఫైనాన్స్​ల బాట పడ్తున్నరు. 
30 శాతం కస్టమర్లు పెరిగిన్రు
డైలీ ఫైనాన్స్​కు  రెగ్యులర్ కస్టమర్లు కాకుండా కొత్తగా తీసుకుంటున్నవాళ్లు 30 శాతం మంది పెరిగిన్రు. కరోనా సెకండ్​ వేవ్​ పోయినా వ్యాపారాలు అంతగా నడుస్తలేవు. అందరికీ ఫైనాన్స్​ ఇవ్వాల్నంటే వెనకా ముందు అవుతున్నం. ఎక్కువ మంది చిరు వ్యాపారులే. నమ్మకం ఉన్నోళ్లకే ఇస్తున్నం. 
                                                                                                                                 ‑ ఆనంద్, మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుడు, విజయనగర్ కాలనీ, హైదరాబాద్​

Tagged people, corona, money, finance, troubles,

Latest Videos

Subscribe Now

More News