వ్యాక్సిన్​ కావాలంటే రిజిస్ట్రేషన్​ మస్ట్

V6 Velugu Posted on May 04, 2021

  • సెకండ్​ డోస్​కూ తప్పనిసరి: హెల్త్​ డిపార్ట్​మెంట్
  • కొవిన్​ పోర్టల్​లో కనిపించని టీకా కేంద్రాల వివరాలు
  • ఉన్న కొన్ని సెంటర్లలోనూ వంద మందికే చాన్స్​
  • సెకండ్​ డోస్​ వాళ్లకే ప్రయారిటీ ఇవ్వాలన్న హెల్త్​ డైరెక్టర్​
  • నిన్న 25 వేల మందికే వ్యాక్సిన్​
  • చాలా జిల్లాల్లో వ్యాక్సినేషన్​ చేయని అధికారులు
  • 4 రోజులకు సరిపడా డోసులు 
  • మరిన్ని వస్తాయన్న ఆఫీసర్లు

హైదరాబాద్​, వెలుగు:  కొవిన్​ పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ చేసుకుని, స్లాట్​ బుక్​ చేసుకున్నోళ్లకు మాత్రమే కరోనా వ్యాక్సిన్​ వేస్తామని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు ప్రకటించారు. స్లాట్​ బుక్​ చేసుకోకుండా డైరెక్ట్​గా సెంటర్ల వద్దకు వస్తే వ్యాక్సిన్​ ఇవ్వబోమన్నారు. సెకండ్​ డోస్​ వేసుకునేటోళ్లు కూడా ముందే స్లాట్​ బుక్​ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కొవిన్​ పోర్టల్​ https://selfregistration.cowin.gov.in/  లో వ్యాక్సినేషన్​ సెంటర్లు, అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను అప్​లోడ్​ చేశామని చెప్పారు. టీకా కేంద్రాల వద్ద జనాలు గుమిగూడుతున్నారని, ఆ రష్​ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఫోన్​లోనే రిజిస్ట్రేషన్​, స్లాట్​ బుకింగ్​ చేసుకోవచ్చన్నారు. ఆ అవకాశం లేనివాళ్లు మీసేవ సెంటర్లలోనూ చేసుకోవచ్చని చెప్పారు. వృద్దులు, పెద్దగా చదువుకోని కుటుంబ సభ్యులకు యువత సాయం చేయాలని కోరారు.  

జనాల్లో గందరగోళం

ముందుగానే రిజిస్ర్టేషన్​ చేసుకున్నా, చేసుకోకపోయినా ఇన్నాళ్లూ వ్యాక్సిన్​ వేశారు. కానీ, ఇప్పుడు సడన్​గా రిజిస్ట్రేషన్​ చేసుకుంటేనే వ్యాక్సిన్​ వేస్తామని ప్రకటించడంతో జనాల్లో కొంత గందరగోళం నెలకొంది. దీనికి తోడు చాలా చోట్ల సెంటర్లు ఉన్నా సోమవారం సాయంత్రం వరకూ అవి కొవిన్​ పోర్టల్​లో కనిపించలేదు. కొన్ని సెంటర్లను చూపించినా ఒక్కో సెంటర్​లో కేవలం వంద స్లాట్లనే అందుబాటులో ఉంచారు. ఈ లెక్కన మంగళవారం నుంచి ఒక్కో సెంటర్​లో వంద మందికే వ్యాక్సిన్​ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్​ డోస్​ వాళ్లకూ ముందస్తు బుకింగ్​ తప్పనిసరి చేయడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్లాట్లన్నింటినీ ఫస్ట్​ డోస్​ వాళ్లే బుక్​ చేసుకుంటే సెకండ్​ డోస్​ వారి పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు నాటికి 7.69 లక్షల మంది కొవిషీల్డ్​, 3.43 లక్షల మంది కొవాగ్జిన్​ సెకండ్​ డోస్​ తీసుకోవాల్సి ఉందని శ్రీనివాసరావు చెప్పారు. సెకండ్ డోస్​ వాళ్లకే ముందుగా టీకా వేయాల్సిందిగా సెంటర్లకు సూచించామన్నారు. అవసరమైతే, సెకండ్​ డోసు వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒకట్రెండు రోజులు కేటాయిస్తామని చెప్పారు. 
చాలా జిల్లాల్లో వెయ్యలె
రాష్ర్టంలో సోమవారం వ్యాక్సినేషన్​ అంతంతమాత్రంగానే సాగింది. ఇప్పటిదాకా సగటున రోజూ లక్షన్నర మందికి టీకాలు వేయగా.. సోమవారం 25,284 మందికి మాత్రమే వ్యాక్సిన్​ వేశారు. నాగర్​‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్​, నల్గొండ, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో అసలు వ్యాక్సినేషన్​ జరగనేలేదు. మిగిలిన జిల్లాల్లో కొన్ని సెంటర్లలో మాత్రమే టీకాలు వేశారు. శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్​ లేదని ప్రకటించిన హెల్త్​ డిపార్ట్​మెంట్​, సోమవారం నాటి పరిస్థితిపై ఎలాంటి సమచారమూ ఇవ్వలేదు. దీంతో చాలా మంది జనాలు వ్యాక్సిన్​ కోసం ఉదయం 7 గంటల నుంచే సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ఉన్నతాధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో వ్యాక్సినేషన్​ నిర్వహించేందుకు మెడికల్​ ఆఫీసర్లు ఇబ్బందిపడ్డారు. జనాల తాకిడి తట్టుకోలేక వ్యాక్సిన్లు వేయట్లేదని జిల్లా కలెక్టర్లు, ఆఫీసర్లు ప్రకటించేశారు. ఉదయం తొమ్మిదిన్నర తర్వాత అన్ని ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్​ ఉందంటూ పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ ప్రకటన విడుదల చేసినా.. అప్పటికే జనాలు వెళ్లిపోయారు. ఆఫీసర్లూ లైట్​ తీసుకున్నారు.  

4 లక్షల డోసులొచ్చినయ్
రాష్ట్రానికి మరో 4 లక్షల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపించింది. సోమవారం కోఠిలోని వ్యాక్సిన్​ స్టోర్​కు ఇవి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకూ పంపించారు. మొత్తంగా ఇప్పుడు రాష్ర్టంలో సుమారు 5 లక్షల డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకో నాలుగు రోజుల వరకూ వ్యాక్సినేషన్​కు ఎలాంటి ఇబ్బంది ఉండదని హెల్త్​ ఆఫీసర్లు తెలిపారు. ఈలోపల మరిన్ని డోసుల వ్యాక్సిన్​ వచ్చే అవకాశం ఉందన్నారు.
 

Tagged vaccine registration, , corona vaccination, ts vaccination, vaccine stock, ts vaccine position

Latest Videos

Subscribe Now

More News