ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. చౌదరిగూడ పరిధిలోని సర్వే నంబర్లు 726, 727, 729 లో ఉన్న సుమారు 5,400 గజాల పార్క్ స్థలాన్ని రియల్టర్లు కబ్జా చేశారని ఇటీవల శ్రీనివాసకాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు.
ప్రజల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన అధికారులు.. శుక్రవారం ఆ స్థలంలో కూల్చివేతలు చేపట్టారు. కబ్జా నిర్మాణాలను తొలగించి, ఆ స్థలం ప్రభుత్వానిదేనని తెలుపుతూ బోర్డులను ఏర్పాటు చేశారు. హైడ్రా చొరవతో తమ కాలనీలో పార్క్ స్థలం తిరిగి దక్కడంతో శ్రీనివాసకాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్థలం విలువ దాదాపు రూ.16 కోట్లు ఉంటుందని అంచనా.
కొనసాగుతున్న అభినందనల వెల్లువ
హైడ్రాకు సపోర్టుగా శుక్రవారం కూడా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు కొనసాగాయి. బాగ్‌లింగంపల్లి శ్రీరాంనగర్ బస్తీలో వరద సమస్య తీర్చడంపై స్థానికులు ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ గ్రామంలోని తురకవాణికుంట నుంచి దేవరయాంజల్ చెరువుకు వెళ్లే వరద కాలువ కబ్జాకు గురైంది. కబ్జా నుంచి నాలాను విముక్తి చేసి వరద సమస్య తీర్చడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ తీశారు.
అభివృద్ధి పేరిట ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసి బండ్ నిర్మాణం చేపట్టారు. దీంతో సహజ ప్రవాహం ఆగిపోయి చెరువు నీరు కలుషితమైంది. ఈ విషయమై హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఎఫ్టీఎల్ పరిధిలో పోసిన మట్టిని పూర్తిగా తొలగించి సమస్యను పరిష్కరించారు. దీంతో స్థానికులు హైడ్రాను అభినందించారు.
