బీఆర్ఎస్ నేత జనార్దన్‌‌‌‌రెడ్డి ఇంట్లో సోదాలు

బీఆర్ఎస్ నేత జనార్దన్‌‌‌‌రెడ్డి ఇంట్లో సోదాలు
  •     నగదు ఉన్నట్లు సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు 
  •     ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌రావు ఇంట్లో కూడా..

జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల ఇండ్లల్లో ఎలక్షన్‌‌‌‌ ఫ్లయింగ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ సోదాలు చేసింది. భారీ ఎత్తున నగదు ఉన్నట్లు సమాచారంతో తనిఖీలు చేపట్టింది. కూకట్‌‌‌‌పల్లి నియోజకవర్గం మోతీ నగర్‌‌‌‌‌‌‌‌లోని నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌‌‌ రెడ్డి నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఇక్కడ ఎలాంటి నగదు దొరకలేదని అధికారులు తెలిపారు. 

ఈ సందర్భంగా పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులపై మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, ఎలాంటి ఫిర్యాదు లేకుండా తమ ఇంట్లో ఎందుకు సోదాలు చేస్తున్నారంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను ఎన్నికల ప్రచారానికి వెళ్లనీయకుండా చేసే కుట్ర జరిగిందని మీడియాతో అన్నారు. 

రెహమత్‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో..

 రెహమత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌రావు నివాసంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లో అక్రమంగా భారీ నగదు  ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి నగదు, ఎలాంటి వస్తువులు దొరకకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఈ సందర్భంగా  రవీందర్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ.. తాను ఇంట్లో లేని సమయంలో అధికారులు సోదాలు చేశారని మండిపడ్డారు.  ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంట్లో చొరబడి తనిఖీలు చేయడమేంటని అభ్యంతరం వ్యక్తంచేశారు. పార్టీలో కీలకంగా పనిచేస్తున్నందున తనపై ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.