పలు దేశాల్లో జోరుగా వ్యాక్సినేషన్​ 

పలు దేశాల్లో జోరుగా వ్యాక్సినేషన్​ 

వాషింగ్టన్​: మాయదారి మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నాయి. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 27 నాటికి ప్రపంచవ్యాప్తంగా 106 కోట్ల 9 లక్షల 17 వేల 21 డోసుల వ్యాక్సిన్లను జనానికి వేశారు. 18 దేశాల్లో కోటికిపైగా డోసులను వేశారు. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలవగా, అమెరికా, ఇండియాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనాలో ఇప్పటిదాకా 23 కోట్ల 59 లక్షల 76 వేల డోసుల వ్యాక్సిన్లను ప్రజలకు ఇచ్చారు. అయితే, ఏ డోసు ఎంత మందికి ఇచ్చారన్న డేటా మాత్రం అందుబాటులో లేదు. చైనా తర్వాత అమెరికాలో 23 కోట్ల 24 లక్షల 7 వేల 669 డోసుల వ్యాక్సిన్​ ఇచ్చారు. 

ఆ దేశ జనాభాలో 43 శాతం మందికి మొదటి డోసు వ్యాక్సిన్​ వేయగా, 29 శాతం మందికి సెకండ్​ డోస్​ ఇచ్చారు. మన దేశంలో 14 కోట్ల 48 లక్షల 79 వేల 233 డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు. అందులో 8.9 శాతం మందికి ఫస్ట్​ డోస్​, 1.7 శాతం మందికి సెకండ్​ డోస్​ వేశారు. 
డబ్బున్న దేశాల్లోనే స్పీడ్​గా..
డబ్బున్న దేశాల్లో టీకా కార్యక్రమం దూసుకుపోతుంటే.. డబ్బులేని పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం స్లోగా సాగుతోంది. వారికి వ్యాక్సిన్లు సరఫరా చేసేవారు లేకపోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ప్రారంభించిన కొవ్యాక్స్​పైనే ఆధారపడుతుండడంతో పేద దేశాల్లో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు, కొన్ని మిడిల్​ఈస్ట్​ దేశాల్లో వ్యాక్సినేషన్​ చాలా నెమ్మదిగా సాగుతోంది. నైజర్​, సౌత్​సూడాన్​, లిబియా, పపువా న్యూ గినియా, జాంబియా, అర్మేనియా, రిపబ్లిక్​ ఆఫ్​ కాంగో, సిరియా, కెమరూన్​, కిర్గిస్థాన్​ వంటి దేశాల్లో 0.1 శాతం మందికి కూడా వ్యాక్సిన్లు వేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 
కొన్ని దేశాల్లో అసలు మొదలుకాలె
వ్యాక్సినేషన్​ తక్కువ జరగడం కాదు.. అసలు వ్యాక్సిన్​ కార్యక్రమం మొదలుకాని దేశాలూ ఉన్నాయి. 17 దేశాల్లో ఒక్క డోసు టీకా కూడా పడలేదు. క్యూబా, తుర్కమెనిస్థాన్​, బెనిన్​, టాంజానియా, నార్త్​ కొరియా, కాంగో, చాద్​, గినియా బిసౌ, బుర్కినా ఫాసో, సెంట్రల్​ ఆఫ్రికన్​ రిపబ్లిక్​, తజికిస్థాన్​, లైబీరియా, బురుండీ, హైతీ, మడగాస్కర్​, ఎరిట్రియా, యెమన్​లలో వ్యాక్సిన్​ వేసిన దాఖలాలు లేవు.