భారత్ లో 150 మందిపై క్లినికల్ ట్రయల్స్

భారత్ లో 150 మందిపై క్లినికల్ ట్రయల్స్

హైదరాబాద్, వెలుగు:కరోనా వైరస్ కు ఏడాదిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరెక్టర్, డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. విదేశాల్లో ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా చాలా ఎక్కువ ఖరీదు ఉంటుందని, మనదేశంలో చాలా తక్కువ ధరలకు అందించే దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 30 మంది సైంటిస్టులు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యారని వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీకి జరుగుతున్న రీసెర్చ్ ల గురించిన వివరాలను చంద్రశేఖర్ ‘వీ6 వెలుగు’తో పంచుకున్నారు.

ప్రశ్న: కరోనాపై ఐఐసీటీలో ఎలాంటి రీసెర్చ్ లు జరుగుతున్నాయి?

జవాబు: కొవిడ్19 చాలా యంగ్ డిసీజ్. ఏదైనా కొత్త వైరస్ కి డ్రగ్ కనుక్కోవాలంటే 10 నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం రెమ్ డెసివిర్,  ఫావిపిరావిర్ డ్రగ్స్ ను కరోనా పేషెంట్లకు ఇవ్వడంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. రెమ్ డెసివిర్ డ్రగ్ పై చాలా దేశాల్లో థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దేశంలో 100 నుంచి 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. 8 వారాలు తర్వాత దీని పనితీరు పూర్తిగా తెలుస్తుంది. ఆ తర్వాత డ్రగ్ కు అనుమతులు వచ్చి.. తయారీ మొదలు పెడితే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రావచ్చు. రోజుకు ఒక గ్రామ్ చొప్పున కరోనా పేషెంట్లకు 8 నుంచి 10 రోజులు ఇస్తే నయం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇది అందుబాటులోకి వచ్చినా దీని ఖరీదుచాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

డ్రగ్ తొందరగా అందుబాటులోకి తెచ్చేందుకు రీసెర్చ్ లు జరుగుతున్నాయా?

ఫావిపిరావిర్ డ్రగ్ తయారీకి కూడా మాలిక్యూల్స్ తయారు చేసి ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అందించాం. దీనిపై క్లినికల్ ట్రయల్స్  జరుగుతున్నాయి. ఫావిపిరావిర్‌కు అనుకూలమైన, చౌకైన సింథటిక్ ఫార్ములాను తయారు చేసి ముంబైకి చెందిన సిప్లా ఫార్మా కంపెనీకి అందజేశాం. ఫావిపిరావిర్ తో క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు సిప్లా కంపెనీ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి కోరింది. సిప్లా జరిపే వైద్య పరీక్షలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షిస్తుందని కేంద్రం తెలిపింది. మందు తయారీకి డీసీజీఐ అనుమతిస్తే  మరో 8 నుంచి 10 వారాల్లో డ్రగ్ అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.

కరోనా కట్టడికి ఎలాంటి రీసెర్చ్ లు జరుగుతున్నాయి?

కరోనా టెస్టింగ్ కు అవసరమైన ఆర్ టీ–పీసీఆర్ కిట్లను ఐఐసీటీ తయారు చేస్తోంది. వీటితో కరోనా టెస్టులే కాకుండా.. అనేక రకాల మల్టీవైరస్ నిర్ధారణ టెస్టులు కూడా చేయొచ్చు. ఈ కిట్లను సీసీఎంబీకి అందిస్తాం. ఇవి ప్రస్తుతం వాడుతున్న కమర్షియల్ కిట్ల కంటే ఎంతో క్వాలిటీతో ఉండటమే కాకుండా తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయి. వారం రోజుల్లో 2 లక్షల కిట్లను తయారు చేసేందుకు అవసరమైన ఎంజైములను అందించే కెపాసిటీకి ఐఐసీటికి ఉంది.

వ్యాక్సిన్, డ్రగ్స్ తయారీకి కూడా మనం చైనా వంటి దేశాలపైనే ఆధాపడుతున్నాం. డ్రగ్స్ కనిపెట్టేందుకు అవసరమైన రా మెటీరియల్ మన దగ్గర తయారు చేయలేమా?

డ్రగ్స్ తయారీకి అవసరైన రా మెటీరియల్ కోసం ఇప్పటి వరకు చైనా, అమెరికా వంటి దేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. 70 శాతం ముడిసరుకును ఆయా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. మరోవైపు రా మెటీరియల్ తయారు చేసే చాలా ఫార్మా కంపెనీలను చైనా మూసివేసింది. దీంతో రేట్లు పెరిగాయి. ప్రస్తుతం డ్రగ్స్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ కోసం మన ఫార్మా కంపెనీలు పని చేస్తున్నాయి. ఐఐసీటీ కూడా ఈ మేరకు కృషి చేస్తోంది. మరో రెండేళ్లలో మన దేశం ఇతర దేశాలకు రా మెటీరియల్ ను అందించే స్థాయికి చేరుకునే అవకాశముంది.

రాబోయే రోజుల్లో వైరస్ తీవ్రత ఎలా ఉండబోతోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం పరిస్థితి కొంత కంట్రోల్ లోనే ఉందని చెప్పాలి. కానీ త్వరగా వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రావాలి. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి. సోషల్ డిస్టెన్స్ లేకపోతే వైరస్ వ్యాప్తి పెరుగుతుంది. కరోనా మోర్టాలిటీ ప్రస్తుతం ఎక్కువగానే ఉంది. ఇంకా రెండు వారాలు వైరస్  తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. జులై ఆఖరు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.