బతుకులు ఆగమాయె: ఏ ఇంట చూసినా కష్టాలు, కన్నీళ్లే

బతుకులు ఆగమాయె: ఏ ఇంట చూసినా కష్టాలు, కన్నీళ్లే

కొన్ని కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు మృతి
హాస్పిటళ్ల బిల్లులు కట్టేందుకు ఆస్తుల అమ్మకాలు, అప్పులు 
భారంగా మారుతున్న కుటుంబ పోషణ.. పెండ్లిళ్లు, గృహ ప్రవేశాలు వాయిదా

హైదరాబాద్/నెట్​వర్క్​, వెలుగు: కరోనా సెకండ్​ వేవ్​ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ప్రతి ఇంటా కష్టాలు, కన్నీళ్లు మిగిలిస్తోంది. ఆరని కాష్టాన్ని రగిలిస్తోంది. రాష్ట్రంలో రోజూ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దాదాపు ప్రతి కుటుంబంలో ఒక్కరైనా కరోనా బారినపడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు ఈ మహమ్మారి కాటుకు బలైపోతున్నారు. హాస్పిటళ్లు వేసే లక్షల బిల్లులను కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి పల్లె, పట్నంలో విషాద గాథలే వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా మంది పెండ్లిళ్లను, శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు. రోజూ కూలీ చేస్తే కానీ గడవని కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. 
పిట్టల్లా రాలిపోతున్నరు
పాజిటివ్ వచ్చిన వ్యక్తి  ట్రీట్​మెంట్​ కోసం ఆస్పత్రికి వెళ్లి తిరిగొస్తారా? లేదా?  అనే భయం చాలా కుటుంబాల్లో నెలకొంది. కండ్ల ముందు యాక్టివ్ గా కనిపించిన వ్యక్తులు వైరస్ సోకి ట్రీట్​మెంట్​ పొందుతూ రెండు మూడు రోజుల్లోనే తుది శ్వాస విడుస్తుండటంతో కుటుంబసభ్యులు, ఆత్మీయులు ఆగమవుతున్నారు. బంధువో, పక్కింటి వారో, తెలిసిన వారో, ఆఫీసులో తమతో పనిచేసేవారో వైరస్  సోకి చనిపోయినట్టు ప్రతి ఒక్కరు బరువెక్కిన హృదయంతో మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. రాష్ట్రంలో రోజూ సగటున 200 మంది చనిపోతున్నట్టు అనధికారిక లెక్కలు చెప్తున్నాయి. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు, ఇంకొన్ని కుటుంబాల్లో తండ్రీకొడుకులు, మరికొన్ని కుటుంబాల్లో ఇంటిల్లిపాది కరోనా కాటుకు బలైన విషాదాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఊళ్లలో రోజూ రెండు మూడు చావులు జరుగుతున్నాయి. వైరస్ వల్ల పరామర్శకు వెళ్లేందుకు బంధువులు, ఫ్రెండ్స్ జంకుతున్నారు. దీంతో మోరల్ సపోర్ట్​ లేక కుమిలిపోతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి.  కొన్ని చోట్ల కాష్టాల్లో కట్టెలు లేని పరిస్థితి ఉందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో శవాలు పదులు సంఖ్యలో ఉంటున్నాయి.
అందరూ బాధితులే
కరోనా సెకండ్ వేవ్  వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా పేషెంట్​గా మారిపోతున్నారు. ఇంట్లో ఒకరికి కరోనా సోకితే దాన్ని గురించి తెలుసుకునే లోపే కుటుంబంలో మిగతా వారికి కూడా అంటుకుంటున్నది. మందుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా పరిస్థితి చేయిదాటడంతో ఆస్పత్రులకు వెళ్లేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్ల కోసం పైరవీలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షలు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఇందు కోసం కొందరు అప్పులు చేస్తే.. ఇంకొందరు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. కొందరు లక్షల్లో ఫీజు కట్టలేక శవాలను తీసుకెళ్లేందుకు వారం పదిరోజుల  సమయం తీసుకుంటున్నారు. సొంత ఊర్లో అంతిమ సంస్కారాలను చేసేందుకు పైసలు లేక ఆస్పత్రులు వద్ద ఉన్న మధ్యవర్తులకు ఎంతో కొంత ఇచ్చి అక్కడే దహన సంస్కారాలు పూర్తి చేయిస్తున్నారు. 
శుభకార్యాలు వాయిదా
అంతా బాగుంటే రాష్ట్రంలో ఈ మే నెలలో  వేలాది పెండిళ్లు జరిగేవి. గత మూడు నెలలు మూఢాల వల్ల పెండ్లిళ్లు జరగలేదు. మే మొదటివారం నుంచి మంచి రోజులు ఉండటంతో చాలా మంది ఉగాదికి ముందే ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. కానీ ఈలోపే కరోనా వైరస్ స్పీడ్ గా స్ప్రెడ్ అయింది. దీంతో పెండ్లి జరగాల్సిన కుటుంబంలో కొందరికి  వైరస్ సోకడం, కొన్ని చోట్ల పెండ్లి కొడుక్కి, మరికొన్ని చోట్ల పెండ్లి కూతురికి, ఇంకొన్ని చోట్ల పెండ్లి పెద్దలకు పాజిటివ్ రావడంతో ముహూర్తాలు వాయిదా పడ్డాయి. కొందరు తక్కువ మంది అతిథుల సమక్షంలో సాదా సీదాగా పెండ్లి చేస్తున్నారు. కొన్ని చోట్ల పంతుళ్లు మండపానికి వచ్చేందుకు భయపడ్తుంటే.. మరికొన్ని చోట్ల పంతుళ్లు వీడియో కాల్స్​ ద్వారా మంత్రాలు చదివి, మూడు ముళ్లు వేయిస్తున్నారు. చాలా మంది గృహ ప్రవేశాలను వాయిదా వేసుకున్నారు. ఒకవేళ చేసినా ఎవరినీ ఆహ్వానించకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో పూజ చేసి, కొత్త ఇంట్లోకి పోతున్నారు.  
అంధకారంలో స్టూడెంట్ల భవిష్యత్తు 
కరోనా వల్ల చదువులన్నీ ఆగమయ్యాయి. స్టూడెంట్ల భవిష్యత్తు అంధకారంలో పడింది. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేశారు. పరీక్షలను వాయిదా వేశారు. కరోనా ఎప్పుడు తగ్గుతుందో.. మళ్లీ స్కూళ్లు, కాలేజీలు ఎప్పుడు ఓపెన్​ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 
నేను ఓయూలో గత సంవత్సరం ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన. ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేస్తతదేమోనని ప్రిపేర్ అవుతున్న. కరోనా తగ్గినట్టే తగ్గి ప్రస్తుతం సెకండ్ వేవ్ మా ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సెకండ్ వేవ్ లో కోచింగ్ సెంటర్ లు నడుస్తలేవు. ఇంట్లనే చదువుకుంటున్నా. సెకండ్ వేవ్ తో హోప్స్ అన్ని పోయాయి. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో, మామూలు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతయో తెలుస్తలే.  - కముటం కస్తూరి, పీజీ స్టూడెంట్, రాజన్న సిరిసిల్ల
ఎన్నో విషాదాలు
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో 3 రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులతో పాటు తల్లి కరోనాతో  మృతి చెందారు. చిన్నకోడూరు మండలానికి చెందిన రాజనరేందర్  తో పాటు ఆయన సోదరుడు రాజు, తల్లి సులోచనకు కరోనా సోకింది.  వీరంతా హైదరబాద్‌‌ లోని ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ మూడు రోజుల వ్యవధిలోనే మృతి చెందారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాపోల్ గ్రామంలో కరోనా వైరస్ బారినపడి 15 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందారు. గత నెలలో గణపతిరావు (65)  కరోనా సోకి ప్రైవేట్ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడు. తండ్రి మృతితో విషాదం నిండిన ఆ ఇంట్లో ఆయన కొడుకు శ్రీనివాస్ (30) ఈ నెల 3న కరోనాతో చనిపోయాడు. శ్రీనివాస్ కు భార్య, కొడుకు ఉన్నారు. మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేటకు చెందిన రైస్​మిల్​ వ్యాపారి కొమ్ము రమేశ్​ (40) కరోనా బారిన పడి ట్రీట్​మెంట్​ తీసుకుంటూ గత నెల 25న చనిపోయాడు. కరోనా సోకి ఆనారోగ్యం పాలవడంతోపాటు కొడుకు చనిపోయిన బెంగతో రమేశ్​ తండ్రి ఈశ్వరయ్య(73) ఈ నెల 6న చనిపోయాడు. 12 రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు  మృతి చెందడంతో వారింట్లో తీరని విషాదం నెలకొంది. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌ పట్టణంలో కరోనాతో 48 గంటల వ్యవధిలో వృద్ద దంపతులు మృతి చెందారు. పట్టణానికి చెందిన ఎ.ఆదిరెడ్డి(83), రామవ్వ(78)  కరోనా బారిన పడి కరీంనగర్ లోని హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. కొద్దిగా కోలుకున్నాక హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ అయి హుస్నాబాద్‌‌ లోని ఇంటికి వచ్చి ఇంట్లోనే వైద్య సేవలు పొందుతుండగా ఏప్రిల్​ 20న ఆదిరెడ్డి మృతి చెందగా, 22న భార్య రామవ్వ కూడా మృతి చెందింది.  క‌రోనా సోకి వారం రోజుల వ్యవధిలోనే భార్యభర్తలు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాస‌విన‌గ‌ర్ కు చెందిన ఆర్ఎంపీ కిష్టయ్య 15 రోజుల కింద క‌రోనాతో  చనిపోయాడు. ఆయన భార్య అనసూయకు కూడా కరోనా సోకగా హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ మృతి చెందింది.

24 గంటల్లో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో 24 గంటల్లోనే తండ్రి, తల్లి, కుమారుడు కరోనాకు బలయ్యారు. కొమరబండకు చెందిన ఓరుగంటి వెంకటేశ్వర్లతో పాటు తల్లిదండ్రులు అంజమ్మ, రంగయ్యకు గత నెల 20న కరోనా పాజిటివ్‌‌‌‌ వచ్చింది. నాలుగు రోజులకు వెంకటేశ్వర్లు ఆరోగ్యం క్షీణించగా  ఖమ్మం తీసుకెళ్లారు. ఇంట్లోనే ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న తండ్రి రంగయ్య ఏప్రిల్‌‌‌‌ 30న రాత్రి చనిపోయాడు. మరుసటిరోజు తల్లి  అంజమ్మ, వెంకటేశ్వర్లు కూడా ప్రాణాలు విడిచారు. 
వారంలో తండ్రీకొడుకులు బలి
ఓ ఉమ్మడి కుటుంబాన్ని కరోనా రోడ్డున పడేసింది. జగిత్యాల కు చెందిన దొంతుల రామ చంద్రం (67)  కిరాణ షాపు నడుపుతుంటాడు. ఈయనకు సునీల్(36), సుమన్ (30) ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సుమన్ కు భార్య,  కూతురు,  కొడుకు ఉండగా.. సుమన్ కు ఇటీవలే పెళ్లయింది. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. గత నెల తండ్రి రామచంద్రం, కొడుకులు సునీల్​, సుమన్​కు కరోనా సోకింది.  ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ ఏప్రిల్​ 13 న  సునీల్​,  రెండు రోజులకు రామచంద్రం, వారం రోజులకు  సుమన్​ చనిపోయారు.