గ్రేటర్‌‌‌‌ వరంగల్లో మళ్లీ దంచికొట్టిన వాన.. అరగంట వానకే ఆగమాగం !

గ్రేటర్‌‌‌‌ వరంగల్లో మళ్లీ దంచికొట్టిన వాన.. అరగంట వానకే  ఆగమాగం !
  • రోడ్లపై నిలిచిన నీళ్లు, రాకపోకలకు ఇబ్బందులు
  • ఏనుమాముల మార్కెట్లో తడిసిన పత్తి బస్తాలు 
  • హనుమకొండ ఊర చెరువు షట్టర్ల తొలగింపు


వరంగల్‍/వరంగల్‌‌‌‌ సిటీ, వెలుగు : 
మొంథా తుఫాన్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ ప్రజలపై మంగళవారం మరోసారి వాన తన ప్రతాపం చూపింది. ఉదయం 10 గంటలకు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కేవలం అరగంట పాటు కురిసిన వర్షానికే వరంగల్‍, కాజీపేట, హనుమకొండలోని కాలనీలు, మెయిన్‌‌‌‌రోడ్లు జలమయం అయ్యాయి. వరంగల్‌‌‌‌లోని పలు కాలనీలు, హనుమకొండలోని అంబేడ్కర్‌‌‌‌ భవన్‌‌‌‌ చుట్టూ ఉన్న కాలనీల్లోకి నిమిషాల వ్యవధిలోనే వరద నీరు చేరింది. ఉద్యోగులు సరిగ్గా విధులకు వెళ్లే టైంలోనే వర్షం పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొంథా ప్రభావం కారణంగా తడిసిన దుస్తులు, వస్తువులను ఆరబెట్టుకుంటున్న బాధితులకు మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. 

ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో  తడిసిన పత్తి

కుండపోతను తలపించేలా అరగంట పాటు కొట్టిన వాన పత్తి, మొక్కజొన్న రైతులకు కన్నీటిని మిగిల్చింది. మంగళవారం ఉదయం కురిసిన వర్షంతో ఏనుమాముల మార్కెట్‌‌‌‌లోని పత్తి, మొక్కజొన్న పూర్తిగా తడిసి ముద్దయింది. మొదట్లో వాతావరణం అనుకూలించగా, తర్వాత మొంథా తుఫాన్‌‌‌‌ ప్రభావం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. చివరకు మిగిలిన పత్తిని అమ్ముకునేందుకు రైతులు సోమవారం రాత్రే ఏనుమాముల మార్కెట్‌‌‌‌కు తీసుకొచ్చారు. మార్కెట్‌‌‌‌కు సుమారు 7,350 బస్తాల వచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా మార్కెట్‍ ప్రారంభమయ్యే సమయంలోనే వాన పడడంతో క్వింటాళ్ల కొద్దీ పత్తి రైతుల కండ్ల ముందే నీటిపాలైంది. అయితే వర్షం రాకముందే ధర అయిన పంట తడిసినప్పటికీ రేటులో మార్పు ఉండదని మార్కెట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జి కార్యదర్శి రాము చెప్పారు. అయితే కొందరు వ్యాపారులు పత్తి బస్తాకు కిలో చొప్పున తరుగు తీసినట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై విచారణ చేస్తామని తెలిపారు. 

హనుమకొండలోని నాలా షట్టర్లు తొలగించిన్రు

ఇటీవల కురిసిన వర్షానికి హనుమకొండలోని పలు కాలనీల్లోకి ఊర చెరువు వరద చేరడానికి.. స్మార్ట్‌‌‌‌ సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన షట్టర్లే కారణమని గుర్తించిన ఆఫీసర్లు వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచి ఇదే పనుల్లో నిమగ్నమైన ఆఫీసర్లు మంగళవారం ఉదయం భారీ క్రేన్లు తీసుకొచ్చి మొత్తం నాలుగు షట్టర్లను తొలగించారు. దీంతో అప్పటివరకు ఆగిన వరద, చెత్త చెదారం, గుర్రపుడెక్క భారీ మొత్తంలో బయటకు కొట్టుకొచ్చింది. షట్టర్లను తొలగించిన క్షణాల వ్యవధిలోనే వరదనీరు అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైన్‌‌‌‌ నాలా గుండా సాఫీగా వెళ్లిపోయింది. దీంతో చుట్టూరా ఉండే 30 కాలనీల జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

మరో రెండు రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడగా.. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్‌‌‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌‌‌‌ నగరంలో మోస్తరు వర్షం పడింది. ఖమ్మం జిల్లా కారేపల్లిలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా పెద్దూరులో 6.9, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌‌‌‌లో 6.5, వికారాబాద్‌‌‌‌ జిల్లా బషీరాబాద్‌‌‌‌లో 6.4, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా కుమ్మెరలో 5.7 సెంటీమీటర్ల వాన పడింది. 

అలాగే వికారాబాద్‌‌‌‌ జిల్లా చౌదాపూర్‌‌‌‌లో 5.3, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లా వెల్దండలో 5.2, రంగారెడ్డి జిల్లా తొమ్మిదిరేకులలో 5.1, యాదాద్రిభువనగిరి జిల్లా తూప్రాన్‌‌‌‌పేటలో 5, కరీంనగర్‌‌‌‌ జిల్లా తనుగులలో 4.9, ఖమ్మం జిల్లా పెద్దగోపటిలో 4.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్‌‌‌‌ సిటీలోని పలు ప్రాంతాల్లోనూ మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. అత్యధికంగా చాంద్రాయణగుట్టలో 3.9 సెంటీమీటర్ల వర్షం పడగా... హయత్‌‌‌‌నగర్‌‌‌‌లో 2.9, ఉప్పల్‌‌‌‌లో 2.7, వనస్థలిపురంలో 2.4, జియాగూడలో 2.3, బండ్లగూడలో 2.1, చందూలాల్‌‌‌‌ బరాదరిలో 2.1, కందికల్‌‌‌‌గేట్‌‌‌‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, బుధ, గురువారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌‌‌‌ సిటీలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజల పాటు సిటీలో వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, పొగమంచు ప్రభావం ఉంటుందని పేర్కొంది.