ఆకలి కంటే కరోనా వైరస్ మంచిది

ఆకలి కంటే కరోనా వైరస్ మంచిది

పని ప్రాంతాలకు తరలుతున్న వలస కూలీలు
లక్నో: కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో లక్షలాది మంది వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాలినడకన వేల కిలో మీటర్లు నడుచుకుంటూ కొందరు తమ ఊళ్లకు చేరుకోగా.. శ్రామిక్ రైళ్ల ద్వారా మరి కొందరు స్వరాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారు మళ్లీ పని ప్రాంతాలకు మరలడం గమనార్హం. ఉత్తర్‌‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్ టైమ్‌లో 30 లక్షల మంది చేరుకోగా.. ఇప్పుడు వారిలో చాలా మంది తిరిగి వర్క్ ప్లేసెస్‌కు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్న వారిలో పలువురు శ్రామికులు మాట్లాడారు. ‘ఒకవేళ యూపీలో ఉపాధి దొరికినా నేను తిరిగి రాను. నేను పని చేసే కంపెనీ ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ అక్కడ ఏ పని దొరికినా చేయడానికి రెడీగా ఉన్నా. ఆకలి కంటే కరోనా మంచిది. కరోనా వల్ల నా పిల్లలు చనిపోవడం కంటే నేను చావడమే బెటర్’ అని అన్సారీ అనే మైగ్రంట్ వర్కర్ తన బాధను వ్యక్తం చేశాడు. ‘గవర్నమెంట్ రేషన్ ఇస్తోంది. కానీ ఇతర ఖర్చులూ ఉంటాయి. ఇక్కడ నరేగాను మినహాయిస్తే చేయడానికి మరో పని లేదు. నాకు అహ్మదాబాద్‌లో ఓ షాప్ ఉంది. ఆ షాప్ రెంట్ కట్టాల్సి ఉంది. నేను తిరిగి వెళ్లకపోతే అద్దె డబ్బులు ఎలా కడతా’ అని రాజేశ్ కుమార్ వర్మ అనే మరో మైగ్రంట్ వర్కర్ చెప్పాడు. కరోనా రిస్క్ ఉన్నా సరే పని ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి వలస కూలీలు సిద్ధమవుతున్నారు.